CJI : ప్రతిదీ మతకోణంలోనే..సోషల్ మీడియాపై ఎన్వీ రమణ ఆగ్రహం

వెబ్ పోర్ట‌ల్స్‌, సోష‌ల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న న‌కిలీ వార్త‌ల ప‌ట్ల సుప్రీంకోర్టు ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

CJI : ప్రతిదీ మతకోణంలోనే..సోషల్ మీడియాపై ఎన్వీ రమణ ఆగ్రహం

Ramana (1) (1)

Updated On : September 2, 2021 / 5:15 PM IST

CJI  వెబ్ పోర్ట‌ల్స్‌, సోష‌ల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న న‌కిలీ వార్త‌ల ప‌ట్ల సుప్రీంకోర్టు ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. కరోనా మొదటి వేవ్ సమయంలో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనమైన తబ్లీగి జమాత్‌ వ్యవహారంలో పలు ఛానెళ్లలో,సోషల్ మీడియాలో వచ్చిన నకిలీ వార్తలను అడ్డుకోవాలంటూ జమైత్ ఉలేమా-ఇ-హింద్ దాఖలు చేసిన పిటిషన్​ పై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ…కంటెంట్‌ విషయంలో సోషల్‌ మీడియా, వెబ్‌పోర్టల్స్ లో జవాబుదారీతనం కనిపించట్లేదన్నారు. దేశంలో ప్రతి విషయాన్ని మత కోణంలో చూపిస్తున్నార‌ని, అదే స‌మ‌స్య అని, కొన్ని ప్రైవేటు ఛానెళ్లలో వస్తున్న వార్తలు సైతం మతపరమైన స్వభావాన్ని కలిగి ఉంటున్నాయని..ఇది దేశానికి చెడు పేరు తీసుకువ‌స్తుంద‌ని ఎన్వీ రమణ అన్నారు.

వ్యవస్థలకు కూడా సోషల్‌ మీడియా వేదికలు స్పందించట్లేదన్నారు. సోషల్‌ మీడియా సంస్థలు కేవలం బలవంతులకే వత్తాసు పలుకుతున్నాయని…ఆఖరికి న్యాయమూర్తులకు వ్యతిరేకంగా వార్తలు ప్రచారం చేస్తున్నాయని ఎన్వీ రమణ మండిపడ్డారు.

న్యాయ‌వ్య‌వ‌స్థ‌ల ప‌ట్ల సోష‌ల్ మీడియా సంస్థ‌ల‌కు జవాబుదారీత‌నం లేకుండా పోయిందన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ఎన్వీ రమణ. వీటిని నియంత్రించేందుకు ఎప్పుడైనా ప్రయత్నించారా అని కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్వీ రమణ ప్రశ్నించారు. అయితే 2021 ఐటీ చ‌ట్టం సోష‌ల్ మీడియాను నియంత్రిస్తుంద‌ని కేంద్ర తరపున సోలిసిట‌ర్‌ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా స‌మాధానం ఇచ్చారు. ఇక,ఈ అంశంపై వివిధ హైకోర్టులలో దాఖలైన కేసులన్నింటినీ సుప్రీంకు బదిలీ చేయాలన్న కేంద్రం అభ్యర్థనకు ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఆరు వారాల తర్వాత మళ్లీ విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.