సచిన్ పైలట్ కు బిగ్ షాక్…రాజస్థాన్ డిప్యూటీ సీఎం,పీసీసీ చీఫ్ పదవుల నుంచి తొలగింపు

  • Published By: venkaiahnaidu ,Published On : July 14, 2020 / 03:04 PM IST
సచిన్ పైలట్ కు బిగ్ షాక్…రాజస్థాన్ డిప్యూటీ సీఎం,పీసీసీ చీఫ్ పదవుల నుంచి తొలగింపు

Updated On : July 14, 2020 / 3:19 PM IST

రాజస్థాన్ లో రాజకీయాలు వేడెక్కాయి. సచిన్​ పైలట్​ను రాజస్థాన్​ డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించింది కాంగ్రెస్. అలాగే రాజస్థాన్ పీసీసీ చీఫ్ పదవి నుంచి కూడా సచిన్ పైలట్ ను తొలగించినట్లు ఆ పార్టీ సీనియర్ నేత రణదీప్ సుర్జేవాలా మంగళవారం ఢిల్లీలో చెప్పారు. మంగళవారం జైపూర్‌లోని ఫెయిర్‌మౌంట్ హోటల్‌లో నిర్వహించిన సీఎల్పీ సమావేశానికి సచిన్ పైలట్ హాజరుకాలేదు. దీంతో ఆయనను పార్టీ నుంచి తొలగించాలని ఆ భేటీలో పాల్గొన్న 102 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

సచిన్ పైలట్​, అతని వర్గంపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు సీఎల్పీ భేటీలో తీర్మానాన్ని కూడా ఆమోదించారు. సీఎల్పీ సమావేశంలో పైలట్​ను పార్టీ నుంచి తొలగించాలని 102 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా సమ్మతి తెలిపిన అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు సుర్జేవాలా.​ సచిన్ పైలట్ వెంట ఉన్నవిశ్వేందర్ సింగ్, రమేష్ మీనాలను మంత్రి పదవుల నుంచి నుంచి తొలగించినట్లు ఆయన వెల్లడించారు. సచిన్ పైలట్ స్థానంలో గోవింద్ సింగ్ దోతస్రా‌ను కొత్త పీసీసీ,డిప్యూటీ సీఎంగా నియమించినట్లు తెలిపారు.

సచిన్ పైలట్, అతడి సహచరులు కొందరు బీజేపీ కుట్రలో చిక్కుకున్నారని, 8 కోట్ల మంది రాజస్థానీలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర చేస్తుండటాన్ని తాను చింతుస్తున్నానని రణదీప్ సుర్జేవాలా అన్నారు. ఇది ఆమోదయోగ్యం కాదన్న ఆయన, అందుకే వారిని మంత్రివర్గం నుంచి తప్పించినట్లు తెలిపారు.

రాజస్థాన్‌ ప్రభుత్వంలో సంక్షోభానికి భాజపానే కారణమని సూర్జేవాలా ఆరోపించారు. కాంగ్రెస్‌ శాసనసభ్యులను భాజపా ప్రలోభానికి గురిచేసిందన్నారు.