Vira Sathidar : సినీ పరిశ్రమలో మరో విషాదం, కరోనాతో ప్రముఖ నటుడు మృతి
కరోనా మహమ్మారి సినీ పరిశ్రమలో మరో విషాదం నింపింది. మరో నటుడిని కోవిడ్ బలి తీసుకుంది. జాతీయ అవార్డు మూవీ ‘కోర్టు’ నటుడు,

Vira Sathidar
Vira Sathidar : కరోనా మహమ్మారి సినీ పరిశ్రమలో మరో విషాదం నింపింది. మరో నటుడిని కోవిడ్ బలి తీసుకుంది. జాతీయ అవార్డు మూవీ ‘కోర్టు’ నటుడు, మరాఠీ యాక్టర్ వీరా సతీదార్ (62) కరోనా సంబంధిత సమస్యలతో కన్నుమూశారు. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన ఆయన గత రెండు రోజులుగా నాగ్ పూర్ లోని ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. అయినా పరిస్థితి మెరుగుకాకపోవడంతో తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు రచయిత, దర్శకుడు చైతన్య తమ్హానే తెలిపారు. ఇది చాలా దురదృష్టకరమైన వార్త, ఈ విషాదాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ సతీదార్ మరణంపై చైతన్య సంతాపం తెలిపారు.
చైతన్య దర్శకత్వంలో వచ్చిన ‘కోర్టు’ మూవీలో కవి, ఉద్యమకారుడు నారాయణ కాంబ్లే పాత్రలో సతీదార్ నటించారు. పలువురి ప్రశంసలందుకున్నారు. జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచిన ఈ చిత్రం పలు కేటగిరీల్లో అవార్డులను సొంతం చేసుకుంది. అలాగే 2016లో అస్కార్ అవార్డుల బరిలో కూడా ఎంట్రీ ఇచ్చింది. సతీదార్ మహారాష్ట్రలోని అంబేడ్కర్ ఉద్యమంలో కీలక నేతగా ఉన్నారు. అలాగే ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ కన్వీనర్‌గా సతీదార్ కొనసాగుతున్నారు. ఆయన మరణంతో పరిశ్రమలో విషాదం అలుముకుంది. పలువురు ఉద్యమ కార్యకర్తలు, ఇతర సినీ రంగ ప్రముఖులు సతీదార్ ఆకస్మిక మరణంపై విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు.
కోవిడ్ చికిత్స కోసం ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చాము. అదే సమయంలో నిమోనియా అటాక్ అయ్యింది. కరోనాకు తోడు ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. మంగళవారం(ఏప్రిల్ 13,2021) ఉదయం 4గంటల సమయంలో తుది శ్వాస విడిచారు” అని వీరా సతీదార్ కొడుకు రాహుల్ చెప్పాడు. వీరా సతీదార్ అసలు పేరుల విపుల్ వైరాగ్డే. వార్దా జిల్లాలో చిన్నతనంలో ఆవులను మేతకు తీసుకెళ్లే వాడు. ఆ తర్వాత రచనలు రాయడం ప్రారంభించాడు. దలిత్ పాంతర్స్ తో కలిసి అంబేద్కర్ మూవ్ మెంట్ లో పాల్గొన్నాడు. పలు మరాఠీ సినిమాల్లో నటించాడు.