బంగాళాఖాతంలో తొలి తుఫాను : ఫణి దిశ మార్చుకుంటుందా

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా మారింది. చెన్నైకి ఆగ్నేయ దిశగా 1,190 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ఇది తీరం వైపుకు దూసుకొస్తోంది. రాగల 24 గంటల్లో ఇది పెను తుఫాన్‌గా మారే అవకాశం ఉందని తుపాను హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. నైరుతి రుతుపవనాల రాకకు ముందు బంగాళాఖాతంలో తొలి తుఫాను ఏర్పడింది. హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి అది… తుఫానుగా బలపడింది. దీనికి బంగ్లాదేశ్ సూచించిన ప్రకారం ‘ఫణి’ అని నామకరణం చేశారు. ఫణి ఏప్రిల్ 27వ తేదీ శనివారం సాయంత్రానికి చెన్నైకి ఆగ్నేయంగా 1,200 కిలోమీటర్ల దూరంలో, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1,390 కిలోమీటర్ల దూరంలో దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఏప్రిల్ 28వ తేదీ ఆదివారం తీవ్ర తుఫానుగా మారి..ఏప్రిల్ 29వ తేదీ సోమవారం అతి తీవ్ర తుఫానుగా బలపడనుంది.
అతి తీవ్ర తుఫానుగా బలపడే క్రమంలో దాని పయనం మందగించే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 30వ తేదీ మంగళవారం సాయంత్రానికి ‘ఫణి’ తుఫాను దిశ మార్చుకుని ఈశాన్యంగా పయనిస్తుందని ఐఎండీ పేర్కొంది. తుఫాను దిశ మార్పు ఖాయమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అతితీవ్ర తుఫాను తీరానికి దగ్గరగా వస్తే ఏప్రిల్ 30, మే 1వ తేదీల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాల్లో విస్తారంగా, అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయి.
తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయి. ఒకవేళ తీరానికి దూరంగా తుఫాను దిశ మార్చుకుంటే మాత్రం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాల్లో ఒక మోస్తరు వర్షాలే కురుస్తాయి. ఏప్రిల్ 29వ తేదీ నుంచి సముద్రం అల్లకల్లోలంగా మారి అలలు ఎగసిపడతాయని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే వేటకు వెళ్లినవారు వెంటనే తీరానికి రావాలని సూచించింది. కాగా, తుఫాన్ దిశ మార్చుకుని ఈశాన్యంగా పయనించే క్రమంలో భూమి నుంచి తుఫాను దిశగా గాలులు వీయనున్నాయి. దీంతో కోస్తాలో ఎండలు పెరిగి కొన్నిచోట్ల వడగాడ్పులు వీస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.