Cyclone Tauktae : గుజరాత్ కు రూ.1000కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన ప్రధాని
తౌక్టే తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన గుజరాత్, దీవ్ దమన్ లో బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏరియల్ సర్వే నిర్వహించారు.

Cyclone Tauktae Modi
Cyclone Tauktae తౌక్టే తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన గుజరాత్, దీవ్ దమన్ లో బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏరియల్ సర్వే నిర్వహించారు. బుధవారం ఉదయం దిల్లీ నుంచి గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చేరుకున్న ప్రధాని..సీఎం విజయ్ రూపానీతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్లో పర్యటిస్తూ ఆర్మెలీ, గిర్సోమ్నాత్, భావ్‌నగర్ జిల్లాల్లో తుఫాను కలిగించిన నష్టాన్ని అంచనా వేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాలైన దీవ్, ఉనా, జఫ్రాబాద్, మహువాల్లో మోడీ ఏరియల్ సర్వే నిర్వహించారు.
తౌక్టే తుపాను నష్టంపై ఏరియల్ సర్వే అనంతరం అహ్మదాబాద్ లో సీఎం మరియు అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్న ప్రధాని..గుజరాత్ కి రూ.1000కోట్ల తక్షణ ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు ప్రకటించారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల పరిహారంతో పాటు గాయపడిన వారికి రూ. 50వేలు అందించనున్నట్టు ప్రధాని పేర్కొన్నారు.
కాగా, గుజరాత్లో తౌక్టే తుపాను ధాటికి 12 జిల్లాల పరిధిలో 45 మంది మృతి చెందారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు, నేలకూలాయి. వేలాది ఇళ్లు, రహదారులు ధ్వంసమయ్యాయి. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. గుజరాత్ లోని దీవ్-ఉనా మధ్య సోమవారం అర్థరాత్రి 1:30గంటలకు తుఫాన్ తీరాన్ని దాటిందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ)ప్రకటించిన విషయం తెలిసిందే.