రహస్యాలు బయటపెడితే..తలలు ఎక్కడ పెట్టుకుంటారు – సిద్ధూ సంచలన వ్యాఖ్యలు

రహస్యాలు బయటపెడితే..తలలు ఎక్కడ పెట్టుకుంటారు – సిద్ధూ సంచలన వ్యాఖ్యలు

Updated On : January 29, 2021 / 3:15 PM IST

deep sidhu threatens : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన రైతుల పోరాటం మలుపులు తీసుకొంటోంది. గణతంత్ర దినోత్సవం రోజున..రైతులు నేతలు చేసిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఆందోళనల్లో ఓ వ్యక్తి మరణించగా..పోలీసులకు గాయాలయ్యాయి. ట్రాక్టర్‌ ర్యాలీ సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అందులో భాగంగా తాజాగా దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్‌ 124A ప్రకారం కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు…దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.

ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పంజాబీ నటుడు దీప్‌ సిద్ధూ, గ్యాంగ్‌స్టర్‌ నుంచి సామాజిక కార్యకర్తగా మారిన లఖాసిధానాలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. రైతులను ఆయనే రెచ్చగొట్టారంటూ…వీడియో వైరల్ అయ్యింది. దీప్ కారణమంటూ..రైతు ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న సంయుక్త్ కిసాన్ మోర్చా (SKM) ఆరోపణలు గుప్పించింది. ఈ తరుణంలో…దీప్ సిద్ధూ..సంచలన వ్యాఖ్యలు చేశారు. రహస్యాలను బయటపెడితే..తలలు ఎక్కడ పెట్టుకుంటారంటూ సూటిగా ప్రశ్నించారు. ఫేస్ బుక్ లైవ్ లో ఘటనపై స్పందించారు.

తనపై చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తీసుకున్న నిర్ణయంతోనే..ట్రాక్టర్ ర్యాలీకి జనం తరలివచ్చారని, వాళ్లంతా మీ మాటలనే అనుసరించారని వ్యాఖ్యానించారు. వచ్చిన లక్షలాది మంది తన నియంత్రణలో ఎలా ఉంటారని, అంతమందిని రెచ్చగొట్టి ఉంటే..మీరంతా ఎక్కడ ఉంటారని నిలదీశారు. తాను ఇప్పటికీ సింఘు సరిహద్దులోనే ఉన్నట్లు, రైతు నేతల రహస్యాలను తాను బయటపెడితే..తలలు ఎక్కడ పెట్టుకుంటారని మరోసారి ప్రశ్నించారాయన. ఆందోళనలు చేసిన రైతులపై విమర్శలు చేయడం కన్నా…మద్దతు ఇస్తే బాగుంటుందని హితవు పలికారు. వారికి మద్దతునిచ్చి ఉంటే..ప్రభుత్వంపై మరింత..వత్తిడి పెరిగే అవకాశం ఉండేదని సిద్ధూ అభిప్రాయం వ్యక్తం చేశారు.