Spiderman : సెల్యూట్ పోలీస్, స్పైడర్ మ్యాన్స్ అంటూ ప్రశంసలు
ఢిల్లీలో ఇద్దరు పోలీసులు చేసిన సాహసానికి జనమంతా సెల్యూట్ చేస్తున్నారు.
Delhi Cops : ఢిల్లీలో ఇద్దరు పోలీసులు చేసిన సాహసానికి జనమంతా సెల్యూట్ చేస్తున్నారు. వారి ధైర్యానికి జేజేలు కొడుతున్నారు. స్పైడర్మ్యాన్స్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. వారి గొప్పపనికి ఎంత పొగిడినా తక్కువే మరి. ప్రాణాలకు తెగించి.. ఇతరులను రక్షించిన వారికి ఎవరైనా సెల్యూట్ చేయాల్సిందే. సినిమాలో స్పైడర్ మ్యాన్ని చూశాం కానీ నిజజీవితంలో వాళ్లిద్దరే స్పైడర్ మ్యాన్స్.
దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్-1 ఏరియాలో ఓ భవనంలోని రెండో అంతస్తులో ఈ ఉదయం మంటలు చెలరేగాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఒకవైపు మంటలు ఆర్పుతూనే బిల్డింగ్ లోపల చిక్కుకున్న వారిని బయటకు తరలించారు. కానీ చివరికి ముగ్గురు బాధితులు బిల్డింగ్లో మిగిలిపోయారు. వారిని రక్షించడం పోలీసులకు కష్టంగా మారింది. మంటల కారణంగా మెట్ల మార్గంలో వారిని చేరుకోవడం సాధ్యం కాలేదు.
ఆ ముగ్గురికి బయటికి రావడానికి ఏ మార్గం లేకుండా పోవడంతో వారు టెన్షన్ పడిపోయారు. తమ ప్రాణాలు పోవడం ఖాయమనే వణికిపోయారు. అలాంటి సమయంలో వారిని ప్రాణాలకు తెగించి కాపాడారు ఇద్దరు పోలీసులు. బిల్డింగ్కు ఉన్న ఇనుప గ్రిల్స్ సాయంతో పైకి ఎక్కి..బాధితులను క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. పోలీసులు ఇలా సాహసం చేసి కాపాడిన ముగ్గురిలో 87 ఏళ్ల వృద్ధురాలు కూడా ఉన్నారు.