వీడో రకం, Swift Desire కార్లనే దొంగిలిస్తాడు, చదివింది 6వరకే, వాడి తెలివికి పోలీసులే విస్మయం

  • Published By: naveen ,Published On : August 7, 2020 / 09:21 AM IST
వీడో రకం, Swift Desire కార్లనే దొంగిలిస్తాడు, చదివింది 6వరకే, వాడి తెలివికి పోలీసులే విస్మయం

Updated On : August 7, 2020 / 10:31 AM IST

ఢిల్లీ పోలీసులు మంగళవారం(ఆగస్టు 4, 2020) ఓ కారు దొంగను పట్టుకున్నారు. ఇప్పటివరకు అతడు 5 కార్లు చోరీ చేశాడు. కార్ల దొంగను పట్టుకోవడంలో పెద్ద విశేషం ఏముంది అనే సందేహం రావొచ్చు. కచ్చితంగా విశేషం ఉంది. వీడో రకం. అన్ని కార్లను చోరీ చేయడు. కేవలం స్విఫ్ట్ డిజైర్ కార్లను మాత్రమే దొంగిలిస్తాడు. వీడు చదివించి 6వ తరగతి వరకే. కానీ తెలివి మాత్రమ అమోఘం. చిన్న టెక్నిక్ తో ఎంతో ఈజీగా డ్రైవర్లను బోల్తా కొట్టించి కారుతో ఉడాయిస్తాడు. వాడి దొంగ తెలివికి పోలీసులే విస్మయం చెందారు.



ఆ కార్ల దొంగ పేరు విశాల్. బేగంపూర్ లో నివాసం ఉంటాడు. గతంలో ఆటో రిపేర్ షాప్ లో పని చేశాడు. క్యాబ్ డ్రైవర్ గానూ పని చేశాడు. ఆటో రిపేర్ షాప్ లో పని చేసే సమయంలో స్విఫ్ట్ డిజైర్ కార్ల మీద మోజు పెంచుకున్నాడు. ఆ మోజుతో తనకు తెలిసిన విద్యతో కార్లు దొంగలించడం స్టార్ట్ చేశాడు.



విశాల్ చోరీ చేసే విధానం తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. అసలు విశాల్ కార్లను ఏ విధంగా చోరీ చేస్తాడంటే.. విశాల్ చోరీ చేసిన ఫోన్ నుంచి స్విఫ్ట్ డిజైర్ ట్యాక్సీ బుక్ చేసుకుంటాడు. వెనుక సీటులో డ్రైవర్ వెనకాలే కూర్చుంటాడు. కాసేపటి తర్వాత డ్రైవర్ సీటు కింద ఉండే స్విచ్ ని డిస్ కనెక్ట్ చేస్తాడు. ఆ వెంటనే ఫ్యూయల్ ట్యాంక్ ఖాళీ అయిపోయినట్టుగా డ్రైవర్ కి కనిపిస్తుంది. ఆ వెంటనే డ్రైవర్ తో మాటలు కలుపుతాడు. ఓసారి ట్యాంక్ లో సరిపడ ఇంధనం ఉందో లేదో చూసుకోవాలని డ్రైవర్ తో చెబుతాడు. అప్పుడు డ్రైవర్ కారుని ఆపి మెకానిక్ కోసం వెళతాడు. డ్రైవర్ అలా కారు దిగి వెళ్లిన మరుక్షణమే, విశాల్ స్విచ్ ని కనెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత కారు స్టార్ట్ చేసిన అక్కడి నుంచి జంప్ అవుతాడు.



ఈ చిన్న టెక్నిక్ తో విశాల్ ఇప్పటివరకు 5 స్విఫ్ట్ కార్లను దొంగిలించాడు. వీటిలో మూడు కార్లను డ్రైవర్లను పెట్టి అద్దెకి నడుపుతున్నాడు. ఒక్కో డ్రైవర్ కి నెలకు రూ.18వేలు శాలరీ కూడా ఇస్తున్నాడు. పోలీసులు విశాల్ చోరీ చేసిన నాలుగు కార్లతో పాటు అతడి నుంచి పిస్టల్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు.