ఢిల్లీ అల్లర్లు: పెళ్లయ్యాక ఒకసారే కలిసి భోజనం చేశారు.. పనిమీద వెళ్లి బుల్లెట్లకు బలైయ్యాడు భర్త

21ఏళ్ల తస్లీన్ ఫాతిమా వాలెంటైన్స్ డే రోజున 22ఏళ్ల అష్ఫక్ హుస్సేన్‌ను పెళ్లి చేసుకుంది. ఫిబ్రవరి 25న భోజనం చేసి బయటకు వెళ్లిన వ్యక్తిని షూట్ చేసి చంపేశారు. అత్తారింటికి వచ్చిన తొలి రోజే భర్త చనిపోవడం.. అసలు భర్త గురించి కూడా పూర్తి వివరాలు తెలియకుండానే విడిచి వెళ్లిపోయాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది.
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షార్ ప్రాంతంలో తస్లీన్.. అష్ఫఖ్‌ల మధ్య వివాహం జరిగింది. ఢిల్లీకి చెందిన వ్యక్తి ఆదివారమే ముస్తఫాబాద్‌లోని సొంతింటికి వెళ్లిపోయాడు. అదే సమయంలో తూర్పు ఢిల్లీకి సమీపంలోని మౌజ్‌పూర్, జఫ్రాబాద్ ప్రాంతాల్లో ఆందోళనలు మొదలయ్యాయి. ఈ కారణంగానే కోడలిని తీసుకుని అనుకున్న దానికంటే ఆలస్యంగా వచ్చింది అష్ఫక్ కుటుంబం.
మంగళవారానికి భర్త దగ్గర చేరుకుంది నవ వధువు. అప్పటికే గోకుల్‌పురి, ముస్తఫాబాద్‌లలో గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 2గంటల సమయంలో తస్లీన్ చేసిన వంట కుటుంబమంతా కలిసి కూర్చుని తిన్నారు. పెళ్లి తర్వాత ఆ జంట కలిసి తిన్నది ఆ ఒక్కసారే.
వృత్తి రీత్యా ఎలక్ట్రిషియన్ అయిన అష్ఫక్‌కు వీధిలోని ఒకరి ఇంట్లో కరెంట్ పోయిందని సమాచారం అందింది. రావాలంటూ ఫోన్ చేయడంతో బయల్దేరాడు. ఆ కుటుంబానికి తెలీదు ఆ చిన్న కారణంతో బయటకు వెళ్లకపోతే కొడుకు బతికేవాడని. దాడిలో గాయానికి గురై దగ్గర్లోని ఆల్ హింద్ హాస్పిటల్‌కు తీసుకెళ్లడం, చనిపోయాడని నిర్దారించుకుని దిల్‌షాద్ గార్డెన్‌లోని జీటీబీ హాస్పిటల్ లో పోస్టు మార్టం అన్నీ ఆ కుటుంబానికి తెలియకుండానే జరిగిపోయాయి.
Also Read | ఢిల్లీ అల్లర్లలోగర్భిణిపై దాడి..36 గంటల నరకయాతన..పుట్టిన మిరాకిల్ బేబీ
ఫోన్ చేసి పోస్టు మార్టం పూర్తయింది. శవాన్ని తీసుకెళ్లమంటూ పోలీసులు చెప్పేవరకూ వారికి సమాచారం లేదు. స్థానికులు, తుపాకులు, కర్రలు, పెట్రోల్ బాంబులతో పాటు ఇతర ఆయుధాలతో తిరుగుతూ ముస్తఫాబాద్‌లో ఆదివారం రాత్రి నుంచి మంగళవారం వరకూ అదుపులేని పరిస్థితి నెలకొల్పారు.
‘పోలీసులకు, ఫైర్ స్టేషన్‌కు ఫోన్ చేసి కాపాడమని అడిగాం. ఎవ్వరూ రాలేదు. అంబులెన్స్‌లు కూడా లోనికి వచ్చే ప్రశక్తి లేదు’ అని అష్ఫక్ బంధువు చెప్పారు. స్కూళ్లతో పాటు పలు ప్రాంతాలను మతపరంగా వివాదాలు రేపుతూ తగలబెట్టారు.