ఆలయం అంశం వాడి ఓట్లడిగితే కఠిన చర్యలు

ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇదిలా ఉంటే ఎన్నికల కమీషన్(ఈసీ) పెట్టిన నిబంధనలు ఈసారి గట్టిగా ఉన్నాయి. సోషల్‌మీడియాపై ఆంక్షలు పెట్టడం.. మతం, కులం పేరుతో ఓట్లు అడిగితే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసిన ఈసి.. కేరళలో శబరిమల ఆలయ అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పార్టీ కూడా ప్రచారానికి వాడకూడదంటూ ఆదేశాలు జారీచేసింది. శబరిమల ఆలయ అంశాన్ని వాడుకోవడం కచ్చితంగా ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తీకా రామ్ మీనా స్పష్టం చేశారు.
తిరువంతపురంలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ప్రచారంలో భాగంగా.. శబరిమల ఆలయం, దేవుడి పేరిట మత భావనలను రేకెత్తించడం; సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించడం; మతం పేరుతో ఓట్లు అడగడం వంటివి చేయరాదని స్పష్టం చేశారు. కేరళకు సంబంధించి శబరిమల వివాదాస్పద అంశమని, ఈ విషయమై రాజకీయ పార్టీలు కచ్చితమైన గిరి గీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కమ్యునిష్ట్ ప్రభుత్వం ఉన్న కేరళలో శబరిమల ఆలయ అంశాన్ని ప్రతిపక్షాలు వాడుకునేందుకు ఇప్పటికే సిద్దం కాగా ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.