ఏ క్షణమైనా: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌పై ఉత్కంఠ నెలకొంది. షెడ్యూల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో 2019 సాధారణ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ ఉంది. శనివారం(మార్చి-9-2019) లేదా సోమవారం(మార్చి-11-2019) ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లను ఈసీ పరిశీలించింది. లోక్‌సభ ఎన్నికలతో పాటే జమ్మూకాశ్మీర్ అసెంబ్లీకి ఎలక్షన్స్ నిర్వహించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
యూనివర్సిటీల్లో పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు సంబంధించిన ఆర్డినెన్స్ కేంద్రం జారీ చేయాల్సి ఉందని, ఆ ఆర్డినెన్స్ శనివారం(మార్చి 9) ఉదయం జారీ అయిన పక్షంలో అదే రోజు సాయంత్రం ఈసీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఆర్డినెన్స్ జారీ కాని పక్షంలో సోమవారం(మార్చి 11) ఎన్నికల షెడ్యూల్‌ను అనౌన్స్ చేయొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్ 15న 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి పోలింగ్ ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదీ ఏర్పాట్లను పూర్తి చేశారు.
2014 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 5నే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణలో ఏప్రిల్ 30న పోలింగ్ జరగ్గా ఏపీలో మే7న పోలింగ్ జరిగింది. ఈ సారి తొలి దశలోనే 2 తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈసారి 5వ తేదీ దాటినా ఇంకా ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేయకపోవడంపై విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
లోక్‌సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, అంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు నిర్వహించేలా ఈసీ ప్రణాళిక రూపొందిస్తోంది. ప్రస్తుతం ఉన్న లోక్‌సభ పదవీకాలం జూన్ 3తో ముగియనుంది. లోక్‌సభ ఎన్నికలను 8 నుంచి 9 దశల్లో 2 నెలల్లో పూర్తి చేసేలా ఈసీ కసరత్తు చేస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అప్పుడే లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేశాయి. ఈసీ మాత్రం ఇంకా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించలేదు.