దేశవ్యాప్త ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం

భారత దేశ చరిత్రలో 1951- 52 తర్వాత 2019 ఎన్నికల ప్రక్రియ అత్యంత సుదీర్ఘ కాలంపాటు జరుగుతోంది. ఏప్రిల్ 11, 18, 23, 29, మే 6, 12, 19 తేదీల్లో మొత్తం 7 దశల్లో దేశవ్యాప్తంగా పోలింగ్ నిర్వహించనున్నారు. ఇవన్నీ పూర్తయిన తరువాత మే 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదటి విడతలో పోలింగ్ జరిగిన నియోజకవర్గాల ప్రజలు, అభ్యర్థులు ఫలితాల కోసం 42 రోజులు వేచిచూడాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఈసీ దేశ వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లలో భాగంగా ప్రతీ పోలింగ్ కేంద్రంలోను విద్యుత్, తాగునీరు, టాయిలెట్స్, స్నాక్స్, పండ్లు వంటి అన్ని మౌలిక వసతులు కల్పించేందు అన్ని చర్యలు తీసుకుంది. వికలాంగులు ఓటు వేసేందుకు వీల్ చైర్లు..అలాగే వారి కోసం ప్రత్యేక ర్యాంప్‌లు, ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకునేలా అధికారులు ఓటర్లకు అవగాహన కల్పించారు. బీఎల్‌ఓలు, వీఆర్‌ఓలు, సూపర్‌వైజర్ల ద్వారా విస్తృతంగా ఓటుహక్కు ప్రాముఖ్యతపై వివరించిన అధికారులు ఓటరు స్లిప్పులు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయిస్తున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి స్పెషల్ ట్రైనింగ్ వంటి పలు కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
అంతేకాదు కొన్ని ప్రాంతాలలో బ్లైండ్ పీపుల్స్ కోసం బ్రెయిలీ ఓటర్ లిస్టు బ్యాలెట్ పేపర్లను కూడా సిద్ధం చేశారు. పోలింగ్ సిబ్బంది ఎటువంటి ఇబ్బందులు పడకుండా వారికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు కల్పించే చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల లోపల అన్ని పోలింగ్ రోజున అన్ని షాపులను మూసివేయాలని, పోలింగ్ విధులకు హాజరయ్యే సిబ్బందికి బస్సుల్లో తాగునీరు, బిస్కెట్ ప్యాకెట్లు, పండ్లను అందజేసేలా కూడా చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో ఓటర్లకు ఎటువంటి సమస్య ఎదురైనా వెంటనే తమ దృష్టికి తేవాలని సూచించారు.
సమస్యాత్మక ప్రాంతాలలో ప్రత్యేక నిఘా..పోలింగ్ కేంద్రాలపై ఆయా జిల్లాలకు సంబంధించిన యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఓటరు విధిగా ఓటు వేసేలా పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకొని అధికారులకు ఓట్లరు సహకరించాలని కోరారు.