700మంది డాక్టర్లను విధుల నుంచి తొలగించనున్న ప్రభుత్వం, కారణం ఇదే

  • Published By: veegamteam ,Published On : March 16, 2020 / 03:08 AM IST
700మంది డాక్టర్లను విధుల నుంచి తొలగించనున్న ప్రభుత్వం, కారణం ఇదే

Updated On : March 16, 2020 / 3:08 AM IST

వాళ్లంతా ప్రభుత్వ డాక్టర్లు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో వారిని డాక్టర్లుగా అపాయింట్ చేశారు. ప్రభుత్వ డాక్టర్ అంటే సాలరీ కూడా భారీగానే ఉంటుంది. నెల నెల ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నా, డ్యూటీలకు మాత్రం రావడం లేదు. విధులకు డుమ్మా కొడుతున్నారు. డాక్టర్లు రాకపోవడంతో ఆసుపత్రులకు వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. దీన్ని సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. కఠిన నిర్ణయం తీసుకుంది. అపాయింట్ మెంట్ ఆర్డర్లు అందుకున్నా, ఇప్పటివరకు డ్యూటీకి రిపోర్టు చేయని 700 మంది డాక్టర్లను డిస్మిస్ చేయాలని నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్లపై కొరడా ఝళిపించింది. డ్యూటీకి రాని డాక్టర్లను డిస్మిస్ చేయనుంది. సుమారు 700మంది వైద్యులను త్వరలోనే విధుల నుంచి తొలగిస్తామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి జై ప్రతాప్ సింగ్ తెలిపారు. 

ఆరోగ్య శాఖ మంత్రి ప్రతాప్ సింగ్ ముఖ్యమంత్రి జన్ ఆరోగ్య మేళాలో ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వ డాక్టర్ల తీరుపై మంత్రి సీరియస్ అయ్యారు. డాక్టర్లు డ్యూటీలకు రావడం లేదని తెలిసిందన్నారు. చాలామంది డాక్టర్లు డ్యూటీకి రాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని, డిపార్ట్ మెంట్ కి చెప్పకుండానే హైయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకుంటూ విధులకు రాకపోవడం కరెక్ట్ కాదన్నారు. డాక్టర్ల తీరుతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.

See Also | భారత్‌లో 110 కి పెరిగిన కరోనా కేసులు, ఆ రాష్ట్రంలో అత్యధికంగా 32 కేసులు నమోదు

డాక్టర్ల డిస్మిస్ ప్రక్రియ స్టార్ట్ అయ్యిందని మంత్రి చెప్పారు. నెల రోజుల్లో వారందరిని సర్వీస్ నుంచి తొలగిస్తామన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ పైనా మంత్రి స్పందించారు. కరోనా గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని మంత్రి ప్రతాప్ సింగ్ తెలిపారు. ముందు జాగ్రత్తలతో కరోనాను కట్టడి చేయొచ్చన్నారు. కరోనాని సమర్థంగా ఎదుర్కొనేందుకు మన దేశం రెడీగా ఉందని చెప్పారు.

700మంది ప్రభుత్వ డాక్టర్లను డిస్మిస్ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. డ్యూటీలకు సరిగా రాని ప్రభుత్వ డాక్టర్లలో వణుకు పుట్టింది. కాగా ఈ నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకుంటూ విధులకు రాని వారిపై ఇలాంటి చర్యలు తీసుకోవడం సబబే అంటున్నారు.