శాశ్వత నిషేధం…చైనా యాప్స్ కు కేంద్రం మరో షాక్

  • Published By: venkaiahnaidu ,Published On : July 10, 2020 / 07:07 PM IST
శాశ్వత నిషేధం…చైనా యాప్స్ కు కేంద్రం మరో షాక్

Updated On : July 10, 2020 / 7:38 PM IST

చైనా యాప్స్ ‌కు మరో షాక్ ఇచ్చింది భారత ప్రభుత్వం. దేశ భద్రత, గోపత్య విషయంలో ముప్పు వాటిల్లుతుందనే కారణంతో టిక్ ‌టాక్ ‌తో సహా 59 చైనా యాప్ ‌లపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ జూన్-29,2020న నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం బ్యాన్ చేసిన 59 యాప్స్‌ కు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 79 ప్రశ్నలతో శుక్రవారం(జులై-10,2020)నోటీసులు జారీ చేసింది.

ఆ ప్రశ్నలకు జూలై 22లోగా స్పందించాలని గడువు ఇచ్చింది. ఒకవేళ అప్పట్లోగా సమాధానం ఇవ్వకపోతే యాప్స్‌ని శాశ్వతంగా బ్యాన్ చేస్తామని భారత ప్రభుత్వం హెచ్చరించింది. ఈ యాప్స్‌ పనితీరుపై ఇండియన్‌ ఇంటెలిజన్స్‌ ఏజన్సీలు, గ్లోబల్‌ సైబర్‌ వాచ్‌ డాగ్‌లు కూడా భారతప్రభుత్వానికి రిపోర్టులను అందించనున్నాయి. ఇప్పుడు ఈ కంపెనీలు ఇచ్చే సమాచారం ఈ ఏజన్సీలు ఇచ్చే రిపోర్టుతో సరిపోవాలి. అందుకు భిన్నంగా ఏం జరిగిన ఈ కంపెనీలు భారీ నష్టాన్ని భరించకతప్పవని ఉన్నతాధికారులు తెలిపారు.

కంపెనీల పుట్టుక, మాతృ సంస్థలు, నిధుల రాక, డేటా మేనేజ్‌మెంట్, కంపెనీ కార్యకలాపాలు, సర్వర్ల నిర్వహణ లాంటి అంశాలతో 79 ప్రశ్నలున్నాయి. అనధికారికంగా డేటా యాక్సెస్ చేయడం, సెక్యూరిటీ ఫీచర్లు, నిఘా కోసం డేటాను దుర్వినియోగం చేయడం లాంటి అంశాలపైనా ప్రశ్నలున్నాయి. భారత ప్రభుత్వం రూపొందించిన 79 ప్రశ్నలకు ఇచ్చే సమాధానాలపైనే ఆ యాప్స్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.

ఈ 79 ప్రశ్నలకు సంబంధించి ప్రభుత్వానికి సరైన వివరణ ఇవ్వగలిగితే మళ్లీ ఈ యాప్‌లు ఇండియాలో పనిచేసే అవకాశాలు ఉన్నాయి. ఈ కంపెనీ ఇచ్చే సమాధానాలు ఒక కమిటీకి పంపిస్తారు. వారు వీటిని పరిశీలించి ప్రభుత్వానికి ఇందుకు సంబంధించిన రిపోర్టులను అందజేస్తారు.