దేశ వ్యాప్తంగా వైభవంగా క్రిస్మస్ సంబురాలు

Happy Christmas Day Celebrations : దేశవ్యాప్తంగా క్రిస్మస్ సందడి నెలకొంది. కరుణామయుడైన ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజామున మొదటి ఆరాధనతో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయాన్నే స్నానమాచరించిన క్రైస్తవులు కొత్త దుస్తులు ధరించి చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. దీంతో చర్చిలన్ని క్రైస్తవులతో కిటకిటలాడుతున్నాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో క్రిస్మస్‌ను జరుపుకుంటున్నారు. పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులతో చర్చిల వద్ద సందడి వాతావరణం నెలకొంది.
ఇక…తెలుగు రాష్ట్రాల్లో చర్చిలన్నీ రంగురంగుల విద్యుద్దీపాలంకరణలతో ప్రత్యేక శోభను సంతరించకున్నాయి. లైట్ల వెలుగుల్లో చర్చిలన్నీ మెరిసి పోతున్నాయి. ప్రతి చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించి సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాకాంతులతో ప్రార్థన మందిరాల్లో క్రిస్మస్ శోభ వెల్లివిరుస్తోంది. క్రైస్తవులకు అతి పవిత్రమైన పండుగ క్రిస్మస్. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది డిసెంబర్ 25న క్రైస్తవులంతా అంగరంగవైభవంగా జరుపుకుంటారు.
మెదక్ సీఎస్ఐ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
ఇక ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్ద చర్చిగా ప్రసిద్ధి గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకు తొలి ప్రార్థన ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే ప్రార్థనలు చేసేందుకు క్రైస్తవులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇక రంగురంగుల విద్యుద్దీపాల కాంతులతో చర్చి శోభాయమానంగా కనపడుతోంది. మిరుమిట్లు గొలిపే విద్యుత్‌కాంతులతో కనువిందు చేస్తుంది. మెదక్ చర్చికి ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, ఆదిలాబాద్ మహారాష్ట్ర, కర్ణాటక నుంచి క్రిస్మస్ వేడుకల కోసం పాదయాత్ర చేస్తూ వారి మొక్కులను తీర్చుకుంటారు. అలాగే విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. కరోనా నిబంధనలను పాటించేలా చర్చి వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు.
పులివెందులలోని సీఎస్‌ఐ చర్చికి సీఎం జగన్
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని సీఎం జగన్… ఇవాళ పులివెందులలోని సీఎస్‌ఐ చర్చికి వెళ్లనున్నారు. ఉదయం పది నుంచి 11 గంటలకు అక్కడ జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నారు. ప్రార్థనలు ముగిసిన అనంతరం తర్వాత కడప నుంచి తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లనున్నారు ఏపీ సీఎం.