భూమి, గాలి, సముద్రంలో ఎక్కడైనా సరే శత్రువుని ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధం

  • Published By: venkaiahnaidu ,Published On : December 14, 2020 / 04:38 PM IST
భూమి, గాలి, సముద్రంలో ఎక్కడైనా సరే శత్రువుని ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధం

Updated On : December 14, 2020 / 6:23 PM IST

భద్రతాపరంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత్​ సిద్ధంగా ఉందని త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. కోల్​కతాలో.. జీఆర్​ఎస్​ఈ(గార్డెన్​ రీచ్ షిప్​బిల్డర్స్​ అండ్​ ఇంజినీర్స్​ లిమిటెడ్​) యార్డ్​ నుంచి 17-A ప్రాజెక్టులోని తొలి యుద్ధనౌక “INS హిమ్ గిరి” ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్న బిపిన్ రావత్..భారత నౌకాదళ సన్నద్ధతను ఇది మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. కాగా, మొత్తం 3 ఫ్రిగేట్​లను రూపొందిస్తోంది జీఆర్​ఎస్​ఈ. నావికాదళంలోకి చేరే ముందు.. ఈ యుద్ధనౌకలను అనేక పరిస్థితుల్లో పరీక్షించనున్నారు.

ఈ సందర్భంగా రావత్ మాట్లాడుతూ…భూమి, గాలి, సముద్రంలో ఎక్కడైనా సరే శత్రువును ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. దేశ భద్రత విషయంలో భారత త్రివిధదళాలు ఏమాత్రం రాజీపడబోవని సీడీఎస్​ బిపిన్​ రావత్​ ఉద్ఘాటించారు. లడఖ్​లో ప్రతిష్టంభన కొనసాగుతోందని.. అదే సమయంలో టిబెట్​ లో కొన్ని కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ప్రతి దేశం తమ వ్యూహాత్మక ప్రయోజనాల ఆధారంగా భద్రతను కట్టుదిట్టం చేసుకుంటుందన్నారు. అయితే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అందరం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కరోనా సంక్షోభంలోనూ.. వాస్తవాధీన రేఖ వెంబడి యథాతథ స్థితిని మార్చేందుకు చైనా ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తోందని తెలిపారు.

టెక్నాలజీ,భద్రతా దళాల ప్రాధాన్యతను ఈ సందర్భంగా సీడీఎస్ రావత్ నొక్కిచెప్పారు. మన వ్యవస్థల్లోకి సాంకేతిక పరిజ్ఞానాన్ని నింపే యుద్ధ పోరాట భవిష్యత్తును చూసే సమయం ఆసన్నమైంది. ఉత్తర సరిహద్దుల్లో మనం ఎదుర్కొనే ఏదైనా ముప్పు లేదా సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్ వద్ద తగినంత ఫోర్సెస్ ఉన్నట్లు రావత్ తెలిపారు. కాగాచైనాతో స‌రిహ‌ద్దులో నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో 15 రోజుల పాటు తీవ్ర స్థాయిలో జ‌రిగే యుద్ధానికి స‌రిప‌డా ఆయుధాలు, మందుగుండు సామ‌గ్రిని సిద్ధంగా ఉంచుకోవ‌డానికి భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు కేంద్రం అధికారం ఇచ్చిన సమయంలో రావత్ ఈ కీలకమైన వ్యాఖ్యలు చేశారు.

కాగా, కేంద్రం అనుమతిచ్చిన నేపథ్యంలో సుమారు రూ.50 వేల కోట్ల‌తో ఈ ఆయుధాలు, మందుగుండు సామ‌గ్రిని స‌మ‌కూర్చుకోవ‌డానికి భ‌ద్ర‌తా బ‌ల‌గాలు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇందులో భాగంగా ఆయుధాలు, మిస్సైళ్లను భారీగా కొనుగోలు చేస్తున్నారు. చైనా, పాకిస్థాన్‌తో ఒకేసారి యుద్ధం వ‌చ్చినా మ‌న బ‌ల‌గాలు ఎదుర్కొనే దిశ‌గా ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌తంలో ప‌ది రోజుల వ‌ర‌కూ స‌రిప‌డా ఆయుధాల‌ను సిద్ధంగా ఉంచుకునేందుకే అనుమ‌తి ఉండేది.

గ‌త కొంత కాలంగా వాస్త‌వాధీన రేఖ ద‌గ్గ‌ర చైనా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌ర‌చూ భార‌త భూభాగంలోకి చొచ్చుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇటు వివాదాస్ప‌ద డోక్లాం ప్రాంతానికి స‌మీపంలో భూటాన్ భూభాగంలో ఏకంగా రోడ్లు, గ్రామాల‌ను నిర్మించేస్తోంది. అయితే చైనా దూకుడుకు అడ్డుక‌ట్ట వేయ‌డానికి భార‌త ప్ర‌భుత్వం కూడా దీటుగానే బ‌దులిస్తోంది. ఇప్ప‌టికే తూర్పు ల‌ఢాక్ ప్రాంతంలో భారీగా సైన్యాన్ని మోహ‌రించింది. ఇప్పుడీ తాజా నిర్ణ‌యంతో భ‌ద్ర‌తా బ‌ల‌గాల్లో మాన‌సిక స్థైర్యాన్ని నింపే ప్ర‌య‌త్నం చేస్తోంది.