బోడో అగ్రిమెంట్ పై కేంద్రం సంతకం…చారిత్రాత్మక ఒప్పందమన్న అమిత్ షా

అసోం యొక్క భయంకరమైన మిలిటెంట్ గ్రూపు – నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్‌తో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఒక ఒప్పందంపై సంతకం చేసింది. దశాబ్దాల పాటు రక్తపాతంతో కొనసాగిన రాష్ట్ర ఉద్యమానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించిన కేంద్రం ఆ దిశగా వారితో ఓ ఒప్పందం చేసుకుంది. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ నేతృత్వంలో ఈ ఒప్పందం జరిగింది. కేంద్రం, అస్సాం సీఎం సరబానంద్ సోనోవాల్,నాలుగు ఫ్యాక్షన్ గ్రూప్ ల అగ్రనాయకత్వం, ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ కూడా ఈ ఒప్పందంపై సంతకం చేసింది. ప్రత్యేక బోడోలాండ్ కోసం కొన్నేళ్లుగా ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ నేతృత్వంలో ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే.
బోడోలాండ్‌కు రాజకీయ సహకారంతో పాటు ఆర్థిక సహకారం కూడా అందిస్తామని ప్రభుత్వం ఒప్పందంలోతెలిపింది. ఈ ఒప్పందం అస్సాం యొక్క ప్రాదేశిక సమగ్రతను చెక్కుచెదరకుండా ఉంచుతుందని, 1500కోట్ల రూపాయల ఫైనాన్షియల్ ప్యాకేజీతో బోడో ప్రజల అభివృద్ధికి అన్నివిధాలుగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇస్తున్నట్లు ఈశాన్యరాష్ట్రాల్లో బీజేపీ ముఖ్య వ్యూహకర్త,అసోం మంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
ఇది చరిత్రాత్మకమైన ఒప్పందం అని ఈ సందర్భంగా అమిత్ షా అన్నారు. ఈ ఒప్పందంతో బోడో ప్రాంతం, అస్సాం అభివృద్ధి సాధిస్తాయని షా తెలిపారు. గతంలో కాకుండా ఇది పర్మినెంట్ ఒప్పందం అని ఆయన అన్నారు. ఈ ఒప్పందం అమలుకు అన్ని విధాల ప్రయత్నిస్తామన్నారు. అన్ని వాగ్ధానాలను అమలు చేస్తామన్నారు. అస్సాం, బోడో ప్రజలకు ఈ ఒప్పందం బంగారు భవిష్యత్తునిస్తుందన్నారు. ఈనెల 30న 1,550 మందికి పైగా బోడో క్యాడర్ ప్రభుత్వం ముందు లొంగిపోనున్నారు. ఆయుధాలను సరండర్ చేయనున్నారు. ఇకపై వాళ్లు తీవ్రవాదులు కాదని,వాళ్లందరూ మన సోదరులని అమిత్ షా తెలిపారు. వారిలో క్లీన్ రికార్డ్ ఉన్నవాళ్లని పారామిలటరీ మిలటరీ దళాలలో భాగం చేయనున్నట్లు తెలిపారు. బోడో ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు.
కోక్రజా, చిరాంగ్, బక్సా, ఉదల్‌గిరి జిల్లాలు బోడో ప్రాంతంలో ఉన్నాయి. ఒప్పందం ప్రకారం…బోడోలాండ్ టెరిటోరియల్ ఏరియా డిస్ట్రిక్ట్స్(BATD)పిలవబడుతున్నప్రాంతం ఇకపై బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్(BTR)గా మార్చబడనుంది. అసోంలోని కొండ జిల్లాల్లో నివసిస్తున్న బోడో ప్రజలకు కేంద్రం ‘హిల్స్ ట్రైబ్’ హోదాను వేగవంతం చేస్తుంది. మొత్తం అసోంలో బోడో బాష(దేవనగరి లిపి) అసోసియేట్ అధికారిక భాష అవుతుంది. అంతేకాకుండా బోడో ప్రాంతం అభివృద్ధి కోసం మూడేళ్లపాటు ఏటా అసోం ప్రభుత్వం 250కోట్లు ఇవ్వనుంది. కేంద్రం కూడా అంతే మొత్తం మూడేళ్లపాటు ఇవ్వనుంది. అంటే మొత్తంగా 1500కోట్లు ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఖర్చుచేయనున్నారు.
పరిశ్రమలు మరియు ఉపాధి ప్యాకేజీలను ఏర్పాటు చేయడానికి మరియు ఎకో టూరిజం(పర్యావరణ పర్యాటకం) ప్రోత్సహించడానికి ఈ నిధులు ఉపయోగించబడతాయి. సామాజిక-సాంస్కృతిక ప్యాకేజీ కింద ప్రభుత్వం ఉపేంద్రనాథ్ పేరిట కేంద్ర విశ్వవిద్యాలయాన్ని, జాతీయ క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇతర ప్రాజెక్టులలో… ప్రాంతీయ వైద్య సంస్థ, హోటల్ మేనేజ్‌మెంట్ క్యాంపస్, మదర్ డెయిరీ ప్లాంట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మరిన్ని నవోదయ విద్యాలయాలు ఉంటాయి. ఈ ఒప్పందం అమలుకు అన్ని విధాల ప్రయత్నిస్తామని, అన్ని వాగ్ధానాలను అమలు చేస్తామని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు.
ఇదిలా ఉంటే బోడోలతో శాంతి ఒప్పందంపై సంతకాలను వ్యతిరేకిస్తూ నాన్ బోడో సంస్థలు 12 గంటల పాటు అస్సాం బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆగిపోయిన బోడోలాండ్ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌కు బోడో ఉద్యమం ఊపిరిపోసిందని ఇప్పుడు శాంతి ఒప్పందం చేసుకోవడమంటే ఉద్యమాన్ని పక్కకు పెట్టినట్లే అని ఆ సంస్థలు చెప్పుకొచ్చాయి. ఇదిలా ఉంటే కొక్రాఝార్, బక్సా, చిరాంగ్, మరియు ఉదల్‌గురి జిల్లాలో బంద్ కారణంగా జనజీవనం స్తంభించిపోయిందని సమాచారం. ఈ జిల్లాల్లో బంద్ ప్రభావం బాగా కనిపించినట్లు తెలుస్తోంది.