లోక్ పాల్ చరిత్ర, అవసరం: మరోసారి హజారే దీక్ష

  • Published By: veegamteam ,Published On : January 21, 2019 / 09:47 AM IST
లోక్ పాల్ చరిత్ర, అవసరం: మరోసారి హజారే దీక్ష

ఢిల్లీ : వ్యక్తి, కుటుంబం, సమూహం, రాజ్యంగా పరిణామం చెందుతూ వచ్చిన మానవ రాజకీయ చరిత్రలో అనేక రకాల రాజ్యవ్యవస్థలు అవతరించి కనుమరుగయ్యాయి. అధికార నిర్వహణలో ఉన్న వ్యక్తుల్లో రానురాను నిరంకుశత్వం, ఆశ్రిత పక్షపాతం, అవినీతి పెరిగిపోతుండటంతో వాటిని కట్టడి చేసేందుకు నియంత్రణ వ్యవస్థల అవసరం ఏర్పడింది. ఆ విధంగా ఉద్భవించినవే అంబుడ్స్‌మన్‌లు. భారత్‌లో వీటినే లోక్‌పాల్, లోకాయుక్త పేరుతో పిలుస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చాక సుదీర్ఘకాలం పార్లమెంటు ఆమోదానికి నోచుకోకుండా నాన్చివేతకు గురైన బిల్లుల్లో లోక్‌పాల్ బిల్లు ఒకటి. 2011లో గాంధేయవాది అన్నాహజారే నేతృత్వంలో అవినీతిపై ప్రజా ఉద్యమం ఉప్పెనలా రావటంతో ఎట్టకేలకు 2013లో లోక్‌పాల్ బిల్లు పార్లమెంటు ఆమోదంపొంది 2014 జనవరి 16న అమల్లోకి వచ్చింది.

 

లోక్ పాల్ అమలులో బీజేపీ నిర్లక్ష్యం అందుకే దీక్ష : అన్నా 
అధికారంలోకి రాగానే జాతీయస్థాయిలో లోక్ పాల్ ని నియమిస్తామని 2014 ఎన్నికల సందర్భంగా బీజేపీ హామీ ఇచ్చిందనీ..ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి  నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదని..అందుకే తాను మరోసారి లోక్ పాల్ వ్యవస్థ అమలు కోసం దీక్ష చేపట్టనున్నట్లుగా ప్రముఖ సామాజిక వేత్త అన్నా హజారే తెలిపారు. జనవరి 30 నుంచి తన సొంత గ్రామం అయిన రాలేగావ్ సిద్ధిలో నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు హజారే ప్రకటించారు. బిజెపి ప్రభుత్వం లోక్ పాల్ వ్యవస్థను నియమించకపోవడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాననీ..లోక్ పాల్ ఏర్పాటుకు స్పష్టమైన కార్యాచరణ ప్రకటించే వరకు దీక్ష విరమించనని హజారే స్పష్టం చేశారు. 

 

లోక్ పాల్ చరిత్ర..
సుదీర్ఘమైన చరిత్ర వెనుక సుదీర్ఘమైన చరిత్ర వుంది. దేశంలో ఉన్నతస్థాయిలో అవినీతిని అరికట్టేందుకు రూపొందించినదే లోక్‌పాల్‌ చట్టం. తొలిసారి జన్‌లోక్‌పాల్ బిల్లును 1968లో శాంతిభూషణ్ ప్రతిపాదించారు. 1969లో లోక్‌సభ ఆమోదించింది.  కానీ రాజ్యసభ ఆమోదం పొందలేదు. ఆ తర్వాత 9 సార్లు ఈ బిల్లును లోక్ సభలో పెట్టినా ఆమోదానికి నోచుకోలేదు. లోక్‌పాల్ బిల్లును ఆమోదించాలంటూ అన్నాహజారే 2011 ఏప్రిల్‌లో ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. లోక్‌పాల్ బిల్లు రూపకల్పనలో సూచనలు చేసేందుకు అన్నాహజారే సహా పలువురు ప్రభుత్వ, పౌర సమాజ ప్రతినిధులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ సర్కారు నోటిఫికేషన్ విడుదల చేయటంతో హజారే దీక్ష విరమించారు. 

2013లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం..2011 డిసెంబర్ 27న లోక్‌సభలో లోక్‌పాల్ బిల్లును ఆమోదించారు. అయితే ప్రధానమంత్రిని ఈ బిల్లు నుంచి మినహాయింపు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ 2012 డిసెంబర్ లో హజారే మళ్లీ దీక్షకు దిగారు. దీంతో  బిల్లులో పలు సవరణలు చేసి డిసెంబర్ 18న లోక్ సభలో ఆమోదించారు. 2013లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించడంతో చట్టంగా మారింది. ఈ బిల్లు కోసం ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే చేపట్టిన బలమైన ఉద్యమం మరువలేనిది. 

అందరూ లోక్ పాల్ చట్టం పరిధిలోకి ..
ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో పాటు ఉన్నతస్థాయి కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు కూడా లోక్‌పాల్ పరిధిలోకి వస్తారు. వీరిపై వచ్చే ఫిర్యాదులను లోకపాల్ పరిశీలించి విచారణ జరుపుతుంది. 
ఎన్నికల సంఘం.. లోక్ పాల్ 
స్వతంత్ర సంస్థ అయిన  ఎన్నికల సంఘం వలె లోక్ పాల్ కూడా వుండటంతో నేరం చేసిన వారు ఎంతటివారైనా..ఈ చట్టం పరిధిలోకి రావాల్సిందే. ఈ క్రమంలో చట్టం ప్రకారం లోక్‌పాల్ తరహాలోనే సంవత్సరంలోగా రాష్ట్రాల్లో కూడా లోకాయుక్తను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.