నక్సల్ ప్రభావిత ప్రాంతాల్ని అభివృధ్ధి చేయండి…అమిత్ షా

ఢిల్లీ : దేశంలోని 10 జిల్లాల్లోనే మావోయిస్టుల సమస్య ఎక్కువగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన సీఎంల సమావేశంలో అభిప్రాయం వ్యక్తమయ్యింది. మావోల ప్రభావం తగ్గించేందుకు ఆ జిల్లాల్లో అభివృధ్ది కార్యక్రమాలు వేగవంతం చేయాలని నిర్ణయించారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు అటవీ, పర్యావరణ అనుమతుల్లో జాప్యం లేకుండా చూడాలని పలు రాష్ట్రాలు అమిత్ షాను కోరాయి. అభివృధ్ది పనులను స్ధానికులకే అప్పగించాలని సమావేశంలో నిర్ణయించారు. కాంట్రాక్టర్లు ముందుకురాని చోట ప్రభుత్వ రంగ నిర్మాణ సంస్థలకు అప్పగించడంపై చర్చ జరిగింది. ఇప్పటి వరకు ఉన్న పరిమితిని రూ.50 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
50 లక్షల లోపు పనులను నామినేషన్ పద్ధతిలో స్థానిక గిరిజనులకు ఇచ్చేలా ఏర్పాటు చేయాలనినిర్ణయించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి తప్ప మరో అంశానికి తావు ఉండకూడదని అమిత్‌షా అన్నారు. ప్రభుత్వ పథకాలు మారుమూల ప్రాంతాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని అమిత్ షా చెప్పారు. ప్రతి గ్రామంలో పోస్టాఫీసు, బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా ఏర్పాటు చేయాలని.. అవకాశం ఉన్న ప్రతి చోటా ఏటీఎంలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
నైపుణ్య శిక్షణా కేంద్రాల ఏర్పాట్లు చేసి స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కమ్యూనికేషన్ టవర్ల ఏర్పాటుకు నిబంధనల సరళీకరణపై దృష్టి పెట్టాలని అమిత్ షా సీఎంలకు విజ్ఞప్తి చేశారు. కాగా… ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నక్సల్స్ నిర్మూలన చర్యలు చేపట్టడంలో సఫలీకృతమయ్యామని హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా తెలిపారు. ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ…ఏపీలో ప్రత్యేక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజి నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. విజయనగరం జిల్లా సాలూరులో ట్రైబల్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అనుమతులివ్వాలని కోరారు, ప్రతి ఐటీడీఏ పరిధిలో ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నెలకొల్పాలని జగన్ సూచించారు.
.