Supreme Court On Refugees: భారత్‌ ఏమీ ధర్మసత్రం కాదు, అందరికీ ఆశ్రయం ఇవ్వలేము, వెంటనే దేశం నుంచి వెళ్లిపోండి- శరణార్ధుల అంశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఏ ప్రాతిపదికన మీకు భారత్ లో ఆశ్రయం కల్పించాలని ప్రశ్నించింది సుప్రీంకోర్టు.

Supreme Court On Refugees: భారత్‌ ఏమీ ధర్మసత్రం కాదు, అందరికీ ఆశ్రయం ఇవ్వలేము, వెంటనే దేశం నుంచి వెళ్లిపోండి- శరణార్ధుల అంశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Supreme Court

Updated On : May 19, 2025 / 7:00 PM IST

Supreme Court On Refugees: శరణార్థుల అంశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భారత్ ఏమీ ధర్మసత్రం కాదంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వారందరికీ ఆశ్రయం ఇవ్వలేము అంది. భారత్ లో తమకు ఆశ్రయం కల్పించాలని కోరుతూ శ్రీలంక శరణార్థుల దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. శరణార్ధులు తక్షణమే భారత్ ను వీడాలని ఆదేశించింది. ఏ ప్రాతిపదికన మీకు భారత్ లో ఆశ్రయం కల్పించాలని ప్రశ్నించింది సుప్రీంకోర్టు.

శరణార్ధుల పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే 140 కోట్ల మంది జనాభాతో ఇబ్బందులు పడుతున్నామంది. విదేశీయులకు కూడా ఆశ్రయం ఇవ్వడానికి ఇండియా ఏమీ సత్రం కాదంది. వెంటనే భారత్ ను వీడాలని స్పష్టం చేసింది. వేరే ఏ దేశానికైనా వెళ్లండి అని శరణార్ధులకు తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు.

ప్రపంచం నలుమూలల నుండి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించగల ధర్మసత్రం కాదు భారత్ అంటూ.. శ్రీలంక జాతీయుడు ఆశ్రయం కోసం చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. శ్రీలంకలో ఒకప్పుడు క్రియాశీలకంగా ఉన్న ఉగ్రవాద సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (LTTE)తో సంబంధం ఉందనే అనుమానంతో 2015లో అరెస్ట్ అయిన శ్రీలంక జాతీయుడు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ దీపాంకర్ దత్తా. జస్టిస్ కె వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.

2018లో, ట్రయల్ కోర్టు అతన్ని చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద దోషిగా నిర్ధారించి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 2022లో, మద్రాస్ హైకోర్టు అతని శిక్షను ఏడు సంవత్సరాలకు తగ్గించింది. కానీ అతని శిక్ష ముగిసిన వెంటనే దేశం విడిచి వెళ్లి, బహిష్కరణకు ముందు శరణార్థి శిబిరంలో ఉండాలని కోరింది.

పిటిషనర్ శ్రీలంకకు చెందిన తమిళుడు. తాను వీసాతో భారతదేశానికి వచ్చానని, తన స్వదేశంలో తన ప్రాణాలకు ముప్పు ఉందని కోర్టుకు తెలిపాడు. తన భార్య, పిల్లలు భారత్ లో స్థిరపడ్డారని, దాదాపు మూడు సంవత్సరాలుగా తాను నిర్బంధంలో ఉన్నానని, బహిష్కరణ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని ఆయన తెలిపారు.

దీనికి జస్టిస్ దత్తా స్పందిస్తూ, “ప్రపంచం నలుమూలల నుండి వచ్చే శరణార్థులకు భారత్ ఆతిథ్యం ఇవ్వాలా? ఇప్పటికే 140 కోట్ల జనాభాతో మేము ఇబ్బంది పడుతున్నాము. అన్ని ప్రాంతాల నుండి వచ్చే విదేశీయులకు ఆశ్రయం ఇవ్వడానికి ఇదేమీ ధర్మశాల కాదు” అని అన్నారు.

Also Read: భారత్‌కు పొంచి ఉన్న ముప్పు..! ఇండియా టార్గెట్‌గా బంగ్లాదేశ్, చైనా కుట్రలు.. రెండో ప్రపంచ యుద్ధం నాటి ఎయిర్ బేస్‌పై డ్రాగన్ కన్ను..

రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవిత స్వేచ్ఛ రక్షణ).. వాక్ స్వాతంత్య్రం, ఉద్యమ స్వేచ్ఛతో సహా ప్రాథమిక హక్కులను అందించే ఆర్టికల్ 19 కింద పిటిషనర్ తరపు న్యాయవాది ఈ విషయాన్ని వాదించారు. పిటిషనర్ నిర్బంధం ఆర్టికల్ 21ని ఉల్లంఘించదని జస్టిస్ దత్తా అన్నారు. ఎందుకంటే అతన్ని చట్టప్రకారం అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. ఆర్టికల్ 19 భారతీయ పౌరులకు మాత్రమే అందుబాటులో ఉందని కోర్టు స్పష్టం చేసింది. “భారత్ లో స్థిరపడటానికి మీకు ఏ హక్కు ఉంది?” అని కోర్టు ప్రశ్నించింది. అయితే.. తాను శరణార్థిని అని, శ్రీలంకలో తన ప్రాణానికి ప్రమాదం ఉందని పిటిషనర్ చెప్పగా.. వేరే దేశానికి వెళ్లమని సుప్రీంకోర్టు చెప్పింది.