భారత్-పాక్ యుద్ధాన్ని ఆపిన క్రెడిట్‌ను కొట్టేసిన ట్రంప్.. అసలు జరిగింది మాత్రం ఇదీ..
ఈ యుద్ధం మధ్యలో తాము జోక్యం చేసుకోబోమని రెండు రోజల క్రితమే అమెరికా తెలిపింది. ఇప్పుడేమో తమవల్లే..

భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు ముగిశాయి. ఈ రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. కాల్పుల విరమణకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందంటూ, రాత్రంతా సుదీర్ఘంగా చర్చలు జరిగాయంటూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. దీంతో కాల్పుల విరమణకు భారత్, పాకిస్థాన్ ఒప్పుకున్నాయని అన్నారు.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో కూడా స్పందిస్తూ తాము మధ్యవర్తిత్వం వహించామన్నట్లు ప్రకటన చేశారు. భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని అన్నారు. తాము భారత ప్రధాని మోదీ, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో పాటు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసీం మునీర్, జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్, అసిమ్ మాలిక్‌తో మాట్లాడామని అన్నారు. ఈ చర్చల్లో అమెరికా నుంచి తనతో పాటు, తమ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాల్గొన్నారని చెప్పారు. 48 గంటల పాటు చర్చలు జరిపామని చెప్పుకొచ్చారు.
అయితే, భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడానికి నిజంగానే అమెరికా మధ్యవర్తిత్వమే కారణమా? అమెరికా వల్లే కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నామని భారత అధికారులు ఎక్కడా ప్రకటించలేదు. అటు పాకిస్థాన్ కూడా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని అమెరికా పేరు ప్రవస్తావించకుండానే తెలిపింది.
Also Read: పాకిస్థాన్‌కి చుక్కలు చూపించిన మన ఆయుధాలు ఇవే..
డీజీఎంవోల మధ్య చర్చలు జరిగాయి: మిస్రీ
“పాకిస్థాన్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) ఇవాళ మధ్యాహ్నం 3.35 గంటలకు భారత డీజీఎంకి ఫోన్ చేసింది. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి భూమి, గగనతలం, సముద్రంలో అన్ని రకాల కాల్పులు, సైనిక చర్యలను ఇరుపక్షాలు నిలిపివేయాలని వారితో ఒప్పందం కుదిరింది. దీన్ని అమలు చేయడానికి ఇవాళ రెండు వైపులా సూచనలు వచ్చాయి. డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మే 12న మళ్లీ చర్చలు జరుపుతుంది” అని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. అమెరికా పేరును మాత్రం ప్రస్తావించలేదు.
జైశంకర్ ఏమన్నారు?
“కాల్పుల విరమణ, సైనిక చర్యలను నిలిపివేయడానికి ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. ఉగ్రవాదంపై భారత్‌కి ఉన్న రాజీలేని వైఖరి మాత్రం కొనసాగుతుంది” అని భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. అమెరికా మధ్యవర్తిత్వం వహించిదని మాత్రం ఆయన ఏమీ చెప్పలేదు.
పాకిస్థాన్ ఏమంది?
ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ చేసిన ప్రకటనలోనూ అమెరికా మధ్యవర్తిత్వం వహించిందన్న అంశం లేదు. “పాక్ ఎల్లప్పుడూ శాంతి, భద్రతలనే కోరుకుంటుంది. మా సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతపై రాజీపడకుండానే శాంతి, భద్రతలకు కట్టుబడి ఉన్నాం” అని అన్నారు.
పాకిస్థాన్‌తో ఉన్న అన్ని సమస్యలను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలనే భారత వైఖరికి అనుగుణంగా ఇండియా, పాక్ మధ్య మాత్రమే చర్చలు జరిగాయని అధికారులు అంటున్నారు. భారత్, పాక్ మధ్య జరిగిన చర్చల్లో మూడో దేశం పాత్ర ఉందన్న వాదనలను ఓ సీనియర్ అధికారి స్పష్టంగా తిరస్కరించారు.
2 రోజుల క్రితమే తమకేం సంబంధం లేదన్న వాన్స్
రెండు రోజుల క్రితం ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో జేడీ వాన్స్ మాట్లాడారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలపై స్పందిస్తూ.. అది తమకు సంబంధించిన అంశం కాదని చెప్పారు. తీవ్రతను కాస్త తగ్గించుకోవడానికి ప్రోత్సహించడమే తాము చేయగలిగిన పని అని అన్నారు. ఈ యుద్ధం మధ్యలో తాము జోక్యం చేసుకోబోమని తెలిపారు. అది ప్రాథమికంగా తమకు సంబంధించినది కాదని చెప్పారు. ఇప్పుడేమో తమ జోక్యం వల్లే భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ జరిగిందనేలా ట్రంప్ ప్రకటించుకుంటున్నారు.