Basmati Rice Prices: భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బాస్మతి బియ్యం ధరలు..

భారత్, పాక్ మధ్య పెరిగిన ఉద్రిక్తతల కారణంగా బాస్మతి బియ్యం సప్లయ్ లో అంతరాయం ఏర్పడుతుందనే భయాలు పెరిగాయి.

Basmati Rice Prices: భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బాస్మతి బియ్యం ధరలు..

Updated On : May 7, 2025 / 8:27 PM IST

Basmati Rice Prices: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరు దేశాలు పరస్పరం ఆంక్షలు విధించుకున్నాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తల ఎఫెక్ట్ బాస్మతి బియ్యం ధరలపై పడింది. బాస్మతి బియ్యం ధరలు భారీగా పెరిగాయి.

బాస్మతి బియ్యం ధరలు 10 శాతానికి పైగా పెరిగాయి. గడిచిన 6 నెలలు తగ్గుముఖం పట్టిన ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా పశ్చిమాసియా మార్కెట్ల నుంచి బాస్మతి బియ్యానికి డిమాండ్ పెరిగింది. బాస్మతి బియ్యం ఉత్పత్తిలో భారత్‌తో పాటు పాక్ అతిపెద్ద ఎగుమతి దేశాలుగా ఉన్నాయి.

భారత దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రతిరోజూ వినియోగించే అత్యంత ప్రజాదరణ పొందిన పారాబాయిల్డ్ బాస్మతి బియ్యం 1509 రకం ధర హోల్‌సేల్‌లో రూ.53 నుండి రూ.59కి పెరిగింది. బిర్యానీ తయారీకి ఉపయోగించే స్టీమ్డ్ బాస్మతి బియ్యం ధర కిలోకు రూ.62-63 నుండి రూ.69కి పెరిగింది. రిటైల్ మార్కెట్లోనూ ఇదే పరిస్థితి. బిర్యానీలో వాడే సెల్లా రకం కిలో 75 రూపాయలకి, ప్రీమియం రకం ధర 80 రూపాయలకి పెరిగింది.

గతేడాది సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం స్థానికంగా సరఫరా కోసం కనీస ఎగుమతి ధరను ప్రవేశపెట్టడంతో బాస్మతి బియ్యం ధరలు తగ్గాయి. దీని వల్ల చాలా ప్రపంచ దేశాలు పాకిస్తాన్ నుంచి కొనడం ప్రారంభించాయి. ఆ తర్వాత భారత్ ఆ పరిమితిని తొలగించింది. అప్పటికే పాకిస్తాన్‌కు ఎక్కువ ఆర్డర్లు చేరడంతో మన దేశంలో ధరలు తగ్గాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సరఫరా ఇబ్బందులు ఉండొచ్చని సందేహాలతో పలు దేశాల కొనుగోలుదారులు తిరిగి భారత్ నుంచి కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

భారత్, పాక్ మధ్య పెరిగిన ఉద్రిక్తతల కారణంగా బాస్మతి బియ్యం సప్లయ్ లో అంతరాయం ఏర్పడుతుందనే భయాలు పెరిగాయి. ఫలితంగా ధరలు పెరుగుతాయని అంచనా ప్రపంచ బియ్యం మార్కెట్ వర్గాల్లో నెలకొందని హర్యానాకు చెందిన బాస్మతి బియ్యం ఎగుమతిదారు ఎల్ఆర్ఎన్‌కె డైరెక్టర్ గౌతమ్ మిగ్లానీ అన్నారు. పశ్చిమాసియాలోనే కాకుండా మద్యప్రాచ్యంలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. గత 15 రోజుల్లో చూసుకుంటే.. ధరలు 8 నుంచి 10శాతం వరకు పెరిగాయని వివరించారు.

Also Read: అమెరికా ఆపరేషన్ నెప్ట్యూన్ నుంచి భారత్ ఆపరేషన్ సిందూర్ వరకు.. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపిన దేశాలు..

“ఉద్రిక్తతలు దేశాలను ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం చేస్తాయి. ఆర్థిక వ్యవస్థలను, వాణిజ్య ప్రవాహాన్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా బాస్మతి బియ్యం వంటి ముఖ్యమైన ఆహార పదార్థాలకు, అంతరాయం లేని వ్యవసాయ సరఫరా గొలుసులను నిర్వహించడానికి శాంతి, స్థిరత్వం చాలా అవసరం” అని ఎల్ఆర్ఎన్‌కె డైరెక్టర్ గౌతమ్ మిగ్లానీ చెప్పారు.

“ప్రపంచ బాస్మతి ఎగుమతుల్లో 70శాతం కంటే ఎక్కువ భారతదేశం నుంచే జరుగుతుంది. సరఫరాలో అంతరాయం.. బియ్యం దిగుమతి చేసుకునే దేశాలను ఇబ్బంది పెడుతుంది. ఖర్చులు పెరుగుతాయి” అని ఆయన పేర్కొన్నారు. “ఇరాన్ 50వేల టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేయడానికి ఇప్పుడే టెండర్ వేసింది. ఇది బాస్మతి బియ్యం వ్యాపారంపై సెంటిమెంట్‌ను పెంచింది” అని భారత్ తో పాటు విదేశాల్లో బియ్యాన్ని విక్రయించే కోల్‌కతాకు చెందిన రైస్‌విల్లా గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సూరజ్ అగర్వాల్ అన్నారు.

2024 భారత్ 5.24 మిలియన్ టన్నుల బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేసి, రూ.48,389 కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించిందని అగ్రి, ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA) తెలిపింది. అమెరికా కొనుగోలుదారులు భారత్ నుండి ఏటా 300,000 టన్నులకు పైగా బాస్మతి బియ్యాన్ని దిగుమతి చేసుకుంటున్నారని LRNK మిగ్లానీ చెప్పారు. “అమెరికాకు బియ్యం రవాణా చేయడానికి 60-70 రోజులు పడుతుంది. కాబట్టి, ట్రంప్ సుంకం అమల్లోకి రాకముందే వస్తువును పొందడానికి వారు ఇప్పుడు ఆర్డర్లు ఇస్తున్నారు.” పంజాబ్, హర్యానాలోని బియ్యం మిల్లులకు తగినంత కార్మికులు దొరకడం లేదు, ఇది సరఫరా వైపు ప్రభావం చూపుతోంది” అని అగర్వాల్ అన్నారు.

సౌదీ అరేబియా, ఇరాన్, యెమెన్ వంటి దేశాలు భారత్ నుంచి ఎక్కువ బాస్మతి బియ్యాన్ని కొనుగోలు చేస్తాయి. మరోవైపు ట్రంప్ టారిఫ్ అమలును 90 రోజుల పాటు తాత్కాలిక విరామం ఇవ్వడంతో అమెరికా కొనుగోలుదారులు కూడా భారత్ నుంచి వీలైనంత ఎక్కువ బాస్మతి బియ్యం కొనాలని భావిస్తున్నారని తెలిపారు.