Operation Sindoor: ఆపరేషన్ సిందూర్, పాక్ దాడులపై భారత ఆర్మీ కీలక ప్రకటన
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులవేళ భారత ఆర్మీ కీలక ప్రకటన చేసింది.

Indian Army
Operation Sindoor: భారత్ – పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఉగ్రమూకలను పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ దుస్సాహసానికి ఒడిగట్టింది. గురువారం రాత్రి క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను భారత సరిహద్దు ప్రాంతాలపై ప్రయోగించింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ లపైకి వాటిని వదిలింది. అయితే, భారత్ ఆర్మీ పాకిస్థాన్ సైన్యం దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఉద్రిక్తత పరిస్థితులవేళ భారత ఆర్మీ కీలక ప్రకటన చేసింది.
‘‘పాకిస్థాన్ సాయుధ దళాలు గురువారం రాత్రి పశ్చిమ సరిహద్దు వెంబడి డ్రోన్లు, ఆయుధ సామాగ్రితో అనేక దాడులు చేశాయి. జమ్మూ కశ్మీర్ లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ దళాలు కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడ్డాయి. డ్రోన్ దాడులను భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. భారత సైన్యం దేశ సార్వభౌమత్వాన్ని ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి కట్టుబడి ఉంది. దుర్మార్గపు కుట్రలకు ధీటుగా స్పందిస్తాం’’ అని భారత ఆర్మీ పేర్కొంది.
మరోవైపు దేశ భద్రతపై ఢిల్లీలో ఇవాళ కీలక సమావేశాలు జరగనున్నాయి. తాజాగా.. ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ భేటీ అయ్యారు. యుద్ధ పరిస్థితులపై మోదీతో చర్చించారు. సీడీఎస్, త్రివిధ దళాల అధిపతులతో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భేటీ కానున్నారు. పాక్ దాడులు, భారత సైన్యం ప్రతిచర్యలు, ఆపరేషన్ సిందూర్ పై చర్చించనున్నారు. తాజా పరిస్థితులపై రక్షణ, విదేశాంగ శాఖల ఆధ్వర్యంలో మీడియా సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.