పాక్ కు భారత ఆర్మీ హెచ్చరిక…సరిహద్దులో పాకిస్తానీ అరెస్ట్

  • Published By: venkaiahnaidu ,Published On : March 7, 2019 / 02:36 AM IST
పాక్ కు భారత ఆర్మీ హెచ్చరిక…సరిహద్దులో పాకిస్తానీ అరెస్ట్

పాకిస్తాన్ ఆర్మీని తాము తీవ్రంగా హెచ్చరించినట్లు భారత ఆర్మీ బుధవారం(మార్చి-6,2019) మీడియాకు తెలిపింది. జమ్మూకాశ్మీర్ సరిహద్దు గ్రామాల్లో పాక్ ఆర్మీ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో అనేకమంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై స్పందించిన భారత ఆర్మీ…ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవద్దని మేము పాకిస్థాన్‌ను హెచ్చరించిన తర్వాత సరిహద్దు నియంత్రణ రేఖ ప్రాంతాల్లో ప్రస్తుతం తాత్కాలికంగా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.
Also Read: అంతేగా…అంతేగా : ఒక్క భారత్ లోనే ఇంటర్నెట్ చీఫ్

24 గంటలుగా కృష్ణాఘాటి, సుందర్‌బానీ ప్రాంతాల్లో పాక్ పెద్ద ఎత్తున కాల్పులకు తెగబడిందని తెలిపింది.పాకిస్థాన్‌ ఆర్మీ పాల్పడుతున్న ఈ చర్యలను భారత ఆర్మీ తిప్పికొడుతోందని, మన ఆర్మీలో ప్రాణనష్టం సంభవించలేదని, పౌరులకు ఎటువంటి గాయాలు కాకూడదనే నిబద్ధతతో పనిచేస్తున్నట్లు భారత ఆర్మీ తెలిపింది. ముఖ్యంగా నియంత్రణ రేఖ ప్రాంతాలపై దృష్టి పెట్టినట్లు తెలిపింది.

మరోవైపు మన భద్రతా బలగాలు ఉగ్రవాదులను లక్ష్యం చేసుకుని పనిచేస్తున్నారని, వారికి లభిస్తున్న మౌలిక సదుపాయాలపై కూడా దృష్టిపెట్టారని ఆర్మీ తెలిపింది. పాక్ తరచూ కాల్పులకు పాల్పడటం,మోటార్ షెల్ దాడులతో తాము నరకం చూస్తున్నట్లు జమ్మూకాశ్మీర్ ప్రజలు వాపోతున్నారు. పాక్ కు ఇప్పటికైనా తగిన బుద్ధి చెప్పాలని వారు కోరుతున్నారు. 
Also Read: పాక్ విమానాలు పారిపోవాల్సిందే : సెప్టెంబర్ లో భారత్ కు రాఫెల్

మరోవైపు ఇండ్-పాక్ అంతర్జాతీయ సరిహద్దులో ఉన్నగుజరాత్ లోని కచ్ జిల్లాలోని రాన్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న 50 ఏళ్ల పాకిస్తానీ వ్యక్తిని బీఎస్ఎఫ్ పాట్రోల్ పార్టీ అరెస్ట్ చేసింది. అసలు ఆ వ్యక్తి ఎవరు,ఎందుకు అక్కడ తిరుగుతున్నాడు,పాక్ నుంచి భారత్ లోకి ఎలా ప్రవేశించాడు,గూఢచర్యానికి ఏమైనా పాల్పడుతున్నాడా అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.