27కిలోల బంగారం, 700కిలోల వెండి.. 6 ట్రంక్‌ పెట్టెలు తెచ్చుకోండి, జయలలిత నగలు తీసుకెళ్లండి

కోర్టు నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకునే సమయంలో ఫోటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్, 6 పెద్ద ట్రంకు పెట్టెలు, అవసరమైన భద్రతా సిబ్బందితో రావాలని ఆదేశించింది.

27కిలోల బంగారం, 700కిలోల వెండి.. 6 ట్రంక్‌ పెట్టెలు తెచ్చుకోండి, జయలలిత నగలు తీసుకెళ్లండి

Jayalalithaas Gold

Updated On : February 20, 2024 / 8:23 PM IST

Jayalalithaas Gold : కర్నాటకలోని బెంగళూరు కోర్టు కీలక తీర్పు వెలువరించింది. తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలితకు చెందిన బంగారు ఆభరణాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించింది. మార్చి 6, 7 తేదీలను కూడా ఖరారు చేసింది. ఆ రెండు రోజుల్లో ఆభరణాలను తీసుకెళ్లేందుకు 6 ట్రంక్ పెట్టెలతో రావాలని తమిళనాడు ప్రభుత్వాన్ని బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. మొత్తం 27 కేజీల బంగారు, వజ్రాభరణాలతో పాటు 700 కేజీలకు పైనే వెండిని.. తమిళనాడు సర్కార్ కి అప్పగించనుంది.

ఈ బంగారు ఆభరణాలను తీసుకోవడానికి ఒక అధికారిని నియమించినట్లు బెంగళూరు స్పెషల్ కోర్టు వెల్లడించింది. తమిళనాడు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐజీపీ.. ఆ అధికారితో సమన్వయం చేసుకోవాలని సూచించింది. కోర్టు నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకునే సమయంలో ఫోటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్, 6 పెద్ద ట్రంకు పెట్టెలు, అవసరమైన భద్రతా సిబ్బందితో రావాలని ఆదేశించింది. ఈ కేసులో తమిళనాడు ప్రభుత్వం కర్నాటకకు లిటిగేషన్ ఫీజుగా 5కోట్లు చెల్లించాలని ఆదేశించింది.

జయలలిత తమిళనాడు సీఎంగా ఉన్న సమయంలో అక్రమార్జన కేసులో 1996లో చెన్నైలోని ఆమె నివాసంలో అధికారులు పలు వస్తువులు సీజ్ చేశారు. ఈ కేసులో జయ దోషిగా తేలడంతో 2014లో బెంగళూరు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, 100 కోట్ల జరిమానా విధించింది. అలాగే స్వాధీనం చేసుకున్న వస్తువులను ఆర్బీఐ, ఎస్బీఐ లేదా బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని స్పష్టం చేసింది. అయితే, ఇంతలోనే జయలలిత మరణించారు. ఈ క్రమంలోనే దీనిపై మరోసారి విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు.. ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని నిర్ణయించింది. జయలలిత చరాస్తులు, స్థిరాస్తులను వేలం వేయటం మాత్రమే ప్రస్తుతం విచారణలో ఉంది.

Also Read : కొరియర్ పేరుతో ఘరానా మోసం.. 2కోట్లు పోగొట్టుకున్న ఐటీ కంపెనీ సీఈవో