కొరియర్ పేరుతో ఘరానా మోసం.. 2కోట్లు పోగొట్టుకున్న ఐటీ కంపెనీ సీఈవో

కొన్ని రోజులకు వీడియో కాల్స్ రావడం ఆగిపోయాయి. దీంతో బాధితుడికి అనుమానం వచ్చింది. ఆరా తీస్తే.. తాను మోసపోయానని తెలిసి షాక్ తిన్నాడు.

కొరియర్ పేరుతో ఘరానా మోసం.. 2కోట్లు పోగొట్టుకున్న ఐటీ కంపెనీ సీఈవో

Courier Scam

Courier fraud : మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను టార్గెట్ గా చేసుకుని చెలరేగిపోతున్నారు. ఆ తరహా మోసాల్లో కొరియర్ ఫ్రాడ్ ఒకటి. ఇటీవలి కాలంలో కొరియర్ ఫ్రాడ్ ఘటనలు ఎక్కువయ్యాయి. పార్సిల్ పేరుతో అడ్డంగా దోచేస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా బెంగళూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొరియర్ పేరుతో ఐటీ సంస్థ సీఈవోను బురిడీ కొట్టించారు కేటుగాళ్లు. ఏకంగా ఆయన నుంచి 2 కోట్ల 30లక్షలు కొట్టేశారు.

బాధితుడి వయసు 66ఏళ్లు. బెంగళూరులో నివాసం ఉంటాడు. ఆయన ఓ ఐటీ సంస్థకు సీఈవోగా ఉన్నాడు. ఫిబ్రవరి 6వ తేదీన ఆయన ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ వ్యక్తి తనను తాను ఫెడెక్స్ కొరియర్ కంపెనీ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. ఐటీ సంస్థ సీఈవోకి ఫోన్ చేసిన అతడు.. ఆ వ్యక్తి పేరు, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్.. ఇలా అన్ని చెప్పాడు. ఆ తర్వాత.. మీ పేరుతో ఒక కొరియర్ వచ్చిందని తెలిపాడు. అందులో డ్రగ్స్ ఉన్నాయని చెప్పాడు. 150 గ్రాముల ఎండీఎం, 4 పాస్ పోర్టులు, 4 కేజీల దుస్తులు ఉన్నాయని.. అవన్నీ అక్రమంగా చైనాలోని షాంఘై సిటీకి పంపుతున్నారని చెప్పాడు.

మీ మీద ముంబై పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదు చేశామని బాధితుడితో చెప్పాడు. ఆ తర్వాత ఫోన్ కాల్ ని నకిలీ పోలీస్ ఆఫీసర్ కి ట్రాన్సఫర్ చేశాడు. వెంటనే మీరు లొంగిపోవాలని ఆ వ్యక్తి చెప్పాడు. అంతేకాదు.. నేను నిజమైన పోలీస్ ఆఫీసర్ అవునో కాదు తెలుసుకోవడానికి వెంటనే స్కైప్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించాడు.

అయితే, నేను అమాయకుడిని. నాకేమీ తెలియదు. స్మగ్లింగ్ లో నా పాత్ర లేదు. డ్రగ్స్ సప్లయ్ తో నాకు సంబంధం లేదు అని బాధితుడు వివరించే ప్రయత్నం చేశాడు. అయితే, మీ ఆధార్ కార్డు ఉపయోగించి కొత్తగా బ్యాంకు ఖాతా ఓపెన్ చేశారని, ఆ అకౌంట్ లోకి డబ్బు కూడా ట్రాన్సఫర్ అయ్యిందని మోసగాళ్లు చెప్పారు. ఇది మనీలాండరింగ్ కేసు అన్నారు. ఈ కేసు నుంచి బయటపడాలంటే.. మీ బ్యాంకు ఖాతా నుంచి జరిగిన లావాదేవీలను చెక్ చేయాలన్నారు. అందుకోసం అతడి బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బునంతా తాము సూచించిన బ్యాంకు అకౌంట్లకు పంపాలని వాళ్లు నమ్మబలికారు.

ఇది నిజమేనేమో అని నమ్మేసిన బాధితుడు.. వాళ్లు చెప్పిన విధంగా 8 బ్యాంకు ఖాతాలకు డబ్బు ట్రాన్సఫర్ చేశాడు. అలా విడతల వారిగా మొత్తం 2 కోట్ల 30లక్షలు ట్రాన్సఫర్ చేశాడు. అంతే.. ఆ మరుక్షణమే.. స్కైప్ కాల్స్ ఆగిపోయాయి. దీంతో బాధితుడికి అనుమానం వచ్చింది. ఆరా తీస్తే.. తాను మోసపోయానని తెలిసి షాక్ తిన్నాడు. లబోదిబోమన్నాడు. అది ఫేక్ కాల్ అని, వాళ్లు మోసగాళ్లు అని, తాను మోసపోయానని.. తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. వెంటనే బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఫిబ్రవరి 16న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.

Also Read : అధిక లాభాల కోసం కొత్తగా బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ఈ సింపుల్ టిప్స్ మీకోసమే..