Karnataka CM: కర్ణాటక సీఎంపై కొనసాగుతున్న సస్పెన్స్.. కాంగ్రెస్ హైకమాండ్‌కు ట్విస్ట్ ఇచ్చిన డీకే.. వెనక్కి తగ్గని సిద్ద రామయ్య
కర్ణాటకలో సీఎం పదవికోసం సిద్ద రామయ్య, డీకే శివకుమార్ పోటీ పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎటూ నిర్ణయం తీసుకోలేక పోతుంది. .

Siddaramaiah and DK Shivakumar
Karnataka Elections Result: కర్ణాటకలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. పార్టీ నేతలు, శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. కానీ, సీఎం పదవి విషయంలో ముఖ్యనేతల మధ్య జరుగుతున్న అంతర్గతపోరు ఆ పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేస్తోంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సైతం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లలో ఎవరికి సీఎం పీఠం అప్పగించాలో తేల్చుకోలేక పోతుంది. మంగళవారం కర్ణాటక సీఎం ఎవరనే విషయంపై స్పష్టమైన ప్రకటన పార్టీ హైకమాండ్ నుంచి వస్తుందని అందరూ భావించారు. కానీ, అలాంటి ప్రకటన ఏమీ రాలేదు. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో పలు దఫాలుగా సిద్ధరామయ్య, శివకుమార్లు భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఇద్దరు ముఖ్యమంత్రి పీఠంపై పట్టువీడకపోవటంతో కాంగ్రెస్ అధిష్టానంసైతం డైలమాలో పడిపోయింది.
Karnataka CM: కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరో తెలిపోయింది.. ఇంతకీ కాంగ్రెస్ ఎవరిని నిర్ణయించిందో తెలుసా?
ట్విస్ట్ ఇచ్చిన శివకుమార్..
సిద్దరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ విడివిడిగా ఢిల్లీలోని ఖర్గే నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. తొలుత డీకే శివకుమార్ భేటీ కాగా.. అర్థగంటకుపైగా వీరి మధ్య చర్చలు జరిగాయి. ఆ తరువాత ఖర్గేతో సిద్ధ రామయ్య భేటీ అయ్యారు. సీఎం పదవి విషయంలో ఖర్గే వద్ద డీకే శివకుమార్ పలు అంశాలపై తేల్చిచెప్పినట్లు సమాచారం. సీఎం పదవిని సిద్ధ రామయ్యకు ఇవ్వొద్దని చెప్పినట్లు తెలిసింది. ప్రత్యామ్నాయంగా ఖర్గేకు సీఎం పదవి ఇచ్చినా నాకు ఓకే. దళితుడికైనా సీఎం పదవి ఇవ్వండి. సిద్ధ రామయ్యను మాత్రం సీఎంగా చేయొద్దని డీకే శివకుమార్ అధిష్టానంకు క్లారిటీగా చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో రెండున్నరేళ్లు సీఎం పదవి విషయంపైనా డీకే అధిష్టానం వద్ద తన వాదనను స్పష్టంగా వినిపించినట్లు సమాచారం. సీఎం పదవి పూర్తికాలం నాకే ఇవ్వండి, సిద్ధరామయ్య గతంలో సీఎంగా చేశాడు. రెండు సార్లు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. నాకు సీఎం పదవి ఇవ్వకపోతే.. నేను ఎమ్మెల్యేగానే ఉండిపోతా. ఎలాంటి పదవులు నాకు వద్దు అని శివకుమార్ అధిష్టానంకు చెప్పినట్లు తెలుస్తోంది.
సీఎం పదవి విషయంలో ఖర్గేతో మంగళవారం సిద్ధ రామయ్య భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. మెజార్టీ ఎమ్మెల్యేలు సూచించిన వారికే సీఎం పదవి ఇవ్వండని చెప్పినట్లు సమాచారం. నేను సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రంలో అభివృద్ధిని గుర్తించండి, ఆ సమయంలో పార్టీకిసైతం ఎంతో పేరు వచ్చిందని సిద్ధ రామయ్య ఖర్గేతో అన్నట్లు తెలిసింది. డీకే శివకుమార్ తో రాజీలో భాగంగా అతనికి ఆర్థికశాఖ, ఇతర పదవులు ఇచ్చే విషయంలో సిద్ధ రామయ్య ససేమీరా అన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. డీకేకు ఆర్థికశాఖ వంటి కీలక శాఖలు అప్పగించేందుకు సిద్ధ రామయ్య అభ్యంతరం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఇద్దరి వాదనలతో కాంగ్రెస్ అధిష్టానం సీఎం అభ్యర్థి ఎంపికపై డైలమాలో పడినట్లు తెలుస్తోంది.
Karnataka CM: సిద్ధూ కాదు డీకే కాదు.. కర్ణాటక ముఖ్యమంత్రిగా మూడో వ్యక్తి?
సోనియాతో చర్చించాకే తుది నిర్ణయం..
కర్ణాటకలో సీఎం పదవికోసం సిద్ద రామయ్య, డీకే శివకుమార్ పోటీ పడుతున్న నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్షులు ఖర్గే ఎటూ నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. పలు దఫాలుగా ఇద్దరితో చర్చించారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలతో కూడిన నివేదికలను తెప్పించుకున్నారు. అన్ని విషయాలు రాహుల్ తో గంటన్నర భేటీలో చర్చించారు. అయినా సీఎం పేరు ప్రకటన విషయంలో సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో మూడో పేరును ప్రత్యామ్నాయంగా ఖర్గే ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఇదే విషయాన్ని రాహుల్ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. అయితే, ఈ రోజు సోనియాగాంధీతో ఖర్గే భేటీ కానున్నారు. తాజా పరిస్థితిపై సోనియాతో చర్చించాక, ఆమె సూచన మేరకు బెంగళూరు వెళ్లి అక్కడే సీఎం పేరును ఖర్గే ప్రకటిస్తారని కాంగ్రెస్ వర్గాల టాక్. మరోవైపు సీఎం పేరు ప్రకటన విషయంలో మరింత లోతుగా చర్చలు జరగొచ్చని, మరో రెండు రోజులు ఈ అంశంపై ఎటూ తేలకపోవచ్చని కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు పేర్కొంటున్నారు.