ఐపీఎస్ అధికారి ఇంట్లో రూ.1000కోట్లు విలువైన డ్రగ్స్

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సమీపంలో భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. 1,818 కిలోల డ్రగ్స్‌ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని ఖరీదు సుమారు రూ.1000కోట్ల వరకూ ఉంటుందని అధికారులు వెల్లడించారు. డ్రగ్స్ ముఠా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇల్లు ఓ ఐపీఎస్ అధికారిగా ఎన్‌సీబీ గుర్తించింది. ఈ వ్యవహారంలో ఇద్దరు నైజీరియా దేశస్థులను, ఒక దక్షిణాఫ్రికా వ్యక్తిని అరెస్టు చేశారు.
ఎన్‌సీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. డ్రగ్స్ ముఠాకు సంబంధించి తమకు చిన్న సమాచారం అందిందని, ఢిల్లీ విమానాశ్రయంలో అనుమానాస్పదంగా కనిపించిన 31 ఏళ్ల విదేశీయురాలి ద్వారా ఈ గుట్టు బయటకు తెలిసినట్లు వివరించారు. తొలుత ఈ విషయాన్ని సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది గుర్తించిందని, ఆమె బ్యాగుల్లో 24.7 కిలోల మాదక ద్రవ్యాలను భద్రతా సిబ్బంది గుర్తించినట్లు తెలిపారు. వాటి గురించి ఆరా తీయగా ఇద్దరు నైజీరియా దేశస్థుల పేర్లు వెల్లడించినట్లు వివరించారు. ఈ మహిళ ఇచ్చిన ఆధారాల ప్రకారం ఎన్‌సీబీ అధికారులు తనిఖీలు చేయగా అసలు విషయం బయటపడినట్లు అధికారులు తెలిపారు.
మాదక ద్రవ్యాల తయారీ చేస్తున్న ఇల్లును సీజ్ చేసిన పోలీసులు ఇంటి యజమాని యూపీ పోలీస్‌లోని ఆర్థిక వ్యవహారాల విభాగంలో పని చేస్తున్నట్లు గుర్తించారు. ఆయనను అధికారులు సంప్రదించగా.. మధ్యవర్తిత్వం ద్వారా ఆ ఇల్లు నెలకు 24వేల చొప్పున అద్దెకిచ్చానని అక్కడ ఏం జరుగుతుందో తనకేమీ తెలియదని చెప్పారు.