Lok Sabha Polls 2024 : 15 మంది అభ్యర్థులతో బీజేపీ 4వ జాబితా విడుదల.. విరూద్‌నగర్‌ బరిలో నటి రాధిక శరత్‌కుమార్

Lok Sabha Polls 2024 : లోక్‌స‌భ ఎన్నికల్లో పోటీ చేయనున్న తమిళనాడు 15 మంది అభ్యర్థుల నాల్గో జాబితాను బీజేపీ విడుదల చేసింది. విరుద్‌న‌గ‌ర్ బరిలో న‌టి రాధిక శరత్ కుమార్ పోటీ చేయనున్నారు.

Lok Sabha Polls 2024 : 15 మంది అభ్యర్థులతో బీజేపీ 4వ జాబితా విడుదల.. విరూద్‌నగర్‌ బరిలో నటి రాధిక శరత్‌కుమార్

Lok Sabha Polls 2024 _ BJP releases 4th list of candidates for Tamil Nadu

Updated On : March 22, 2024 / 5:15 PM IST

Lok Sabha Polls 2024 : లోక్‌స‌భ ఎన్నిక‌లకు సంబంధించి తొలి ద‌శ నోటిఫికేష‌న్ ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ అభ్య‌ర్ధుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే మూడు అభ్యర్థుల జాబితాలను ప్రకటించిన బీజేపీ తాజాగా శుక్రవారం (మార్చి 22) పుదుచ్చేరి, తమిళనాడు లోక్‌సభ అభ్యర్థులతో కూడిన నాల్గో జాబితాను ప్రకటించింది. ఈ నాల్గో జాబితాలో త‌మిళ‌నాడులో 14 లోక్‌స‌భ నియోజకవర్గాలు, పుదుచ్చేరిలో ఒక నియోజకవర్గంతో కలిపి మొత్తం 15 మంది అభ్య‌ర్ధుల‌ను ప్రకటించింది. ఇక, మూడో జాబితాలో 9మంది అభ్యర్థుల్లో చెన్నై సౌత్ నుంచి తెలంగాణ మాజీ గవర్నర్, పార్టీ నేత తమిళిసై సౌందరరాజన్, కోయంబత్తూరు నుంచి అన్నామలై పోటీ చేయనున్నారు.

చెన్నై సౌత్ నుంచి తమిళిసై.. విరుద్‌న‌గ‌ర్ బరిలో న‌టి రాధిక :
అయితే, విరుద్‌న‌గ‌ర్ లోక్‌స‌భ స్థానం నుంచి సినీన‌టి రాధికా శ‌ర‌త్‌కుమార్‌ బ‌రిలో దిగనున్నారు. ఈ జాబితాలో మొత్తం 15 మంది అభ్యర్థులు ఉన్నారు. నీలగిరి నుంచి సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్‌ మురుగన్‌ పోటీ చేయనున్నారు. ఈ జాబితా ప్రకారం.. సీనియర్ నేతలు ఏసీ షణ్ముగం వేలూరు నుంచి పోటీ చేయనుండగా, పొన్ రాధాకృష్ణన్ కన్నియాకుమారి నుంచి పోటీ చేయనున్నారు. తమిళనాడులో పాటలి మక్కల్ కట్చి (పీఎంకే)తో బీజేపీ పొత్తు పెట్టుకుంది. గత ఏడాది బీజేపీ మిత్రపక్షంగా ఏఐఏడీఎంకే నిష్క్రమించింది.

పుదుచ్చేరి బరిలో నమశ్శివాయం :
తమిళనాడులోని మొత్తం 19 లోక్‌సభ స్థానాల్లో అధికార డీఎంకే, ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. చెన్నై నార్త్, చెన్నై సౌత్, కాంచీపురం (SC), అరక్కోణం, అరణి, సేలం, ఈరోడ్, తేని, నీలగిరి, కోయంబత్తూర్, పొల్లాచ్చి, తూత్తుకుడి, శ్రీపెరంబుదూర్, వెల్లూరు, ధర్మపురి, తిరువణ్ణామలై, కళ్లకురిచ్చి, పెరంబలూరులో రెండు ప్రధాన ద్రవిడ పార్టీలు ఒకదానికొకటి తలపడనున్నాయి. పుదుచ్చేరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి నమశ్శివాయంను బరిలో దింపేందుకు బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. నమశ్శివాయం ఎన్ రంగస్వామి ప్రభుత్వంలో కేంద్ర పాలిత ప్రాంతానికి హోంమంత్రిగా ఉన్నారు.

39 స్థానాలకు ఏప్రిల్ 19న తొలిదశ పోలింగ్ :
రాష్ట్రంలోని 39 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న తొలి దశలో పోలింగ్ జరగనుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. 2019లో డీఎంకే 33.2 శాతం ఓట్లతో 23 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. 12.9 శాతం ఓట్లతో కాంగ్రెస్ 8 సీట్లు, సీపీఐ తమిళనాడులో 2 సీట్లు గెలుచుకుంది. దేశంలోని 543 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు ప్రారంభమై జూన్ 1న ముగియనున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. దాదాపు 97 కోట్ల మంది ఓటర్లు సాధారణ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న 15 మంది అభ్యర్థుల జాబితా
1 పుదుచ్చేరి – ఎ. నమశ్శివాయం
2 తిరువళ్లూరు (SC)- పొన్. వి.బాలగణపతి
3 చెన్నై నార్త్- ఆర్‌సి పాల్ కనగరాజ్
4 తిరువణ్ణామలై- ఎ. అశ్వథామన్
5 నమక్కల్- కెపి రామలింగం
6 తిరుప్పూర్- ఏపీ మురుగానందం
7 పొల్లాచ్చి- కె. వసంతరాజన్
8 కరూర్- వివి సెంథిల్నాథన్
9 చిదంబరం (SC)- పి. కార్తీయాయిని
10 నాగపట్నం (SC)- SGM రమేష్
11 తంజావూరు- ఎం. మురుగానందం
12 శివగంగ- డా. దేవనాథన్ యాదవ్
13 మధురై- ప్రొఫెసర్ రామ శ్రీనివాసన్
14 విరుదునగర్- రాధిక శరత్‌కుమార్
15 తెన్కాసి (SC)- బి. జాన్ పాండియన్