దక్షిణాది నుంచి చికెన్ దిగుమతులపై మధ్యప్రదేశ్ నిషేధం

Madhya Pradesh Bans Chicken Import కేరళ సహా ఇతర దక్షిణాది రాష్ట్రాల నుంచి చికెన్ దిగుమతులపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. బర్డ్ ఫ్లూ విస్తరణ నేపథ్యంలో శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. పదిరోజులపాటు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. బుధవారం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్… బర్డ్‌ఫ్లూపై అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం అనంతరం ఇండోర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాల నుంచి మధ్యప్రదేశ్‌లోని సరిహద్దు జిల్లాలకు చికెన్ సరఫరా జరుగకుండా ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు.
దక్షిణాధిలో కేరళ సహా మరికొన్ని రాష్ట్రాల్లోని కోళ్లలో బర్డ్ ఫ్లూ లక్షణాలు బయటపడ్డాయని, అందుకే ముందుజాగ్రత్త చర్యగా ఆయా రాష్ట్రాల నుంచి 10 రోజులపాటు మాంసం దిగుమతులపై నిషేధం విధించాల్సి వచ్చిందని సీఎం తెలిపారు. మధ్యప్రదేశ్‌లో కాకులతోపాటే గాల్లో ఎగిరే ఇతర పక్షుల్లోనూ బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించాయని, అయితే కోళ్లలో మాత్రం రాష్ట్రంలో ఎక్కడా బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు కనిపించలేదని తెలిపారు.
బర్ల్ ఫ్లూ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఎక్కడైనా పక్షులు చనిపోతే ఆ వివరాలను వెంటనే కేంద్రానికి అందజేయాలని సూచించింది. అంతేకాదు ఈ సీజన్‌లో మన దేశానికి విదేశాల నుంచి పెద్ద మొత్తంలో వలస పక్షులు వస్తాయని.. ఈ నేపథ్యంలో వాటిపై గట్టి నిఘా ఉంచాలని తెలిపింది. ఈ వైరస్ మనుషులకు వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టంచేసింది.
ప‌్రస్తుతం ఐదు రాష్ట్రాలను వణికిస్తున్న బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా)కు భయపడాల్సిన పని లేదని కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. గుడ్లు, మాంసాన్ని బాగా ఉడకబెట్టుకొని తినండంటూ ప్రజలకు సూచించారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు అలర్ట్‌గా ఉండాలని ఆదేశాలు జారీ చేశామని, అన్ని విధాలుగా సాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. బర్డ్ ఫ్లూ ఎక్కువగా ఉన్న హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ, రాజస్థాన్ రాష్ట్రాల్లో 12 ప్రధాన కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. గత పది రోజులలో ఈ నాలుగు రాష్ట్రాలలో లక్షల కొద్దీ కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. బర్డ్ ఫ్లూ వ్యాప్తి పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది.