మగ సైనికులకేనా? మహిళలకు ఉద్యోగాలివ్వరా?

మగ సైనికులు తమకన్నా పెద్ద పోస్ట్ ల్లో మహిళ అదికారులను ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు కాబట్టి, వాళ్లకు ఉన్నత ఉద్యోగాలను ఇవ్వలేమని కేంద్రం సుప్రీం కోర్టుకు చెప్పింది. మహిళలు మగాళ్లతో సమానం కావడానికి ప్రయత్నించడం కాదు, వాళ్లను దాటడానికి ప్రయత్నించాలని సుప్రీం కోర్టుకు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు.
సుప్రీంకోర్టుకు కేంద్రం నోట్ సమర్పించిన రోజు తర్వాత తుషార్ ఈ కామెంట్ చేశారు.అంటే సైన్యంలో మగజవాన్లు, అధికారులంత శారీరక ధారుఢ్యంలోనూ, పోస్టుల్లోనూ మహిళా సైనికులు పోటీపడలేరన్నదా కేంద్రం ఉద్దేశం? మగాళ్ల కన్నా చాలా ముందున్నప్పుడు ఎందుకు మగాళ్లకు సమానం కావాలని మహిళలు ప్రయత్నించాలి? జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ అజయ్ ల ముందు మెహతా వినిపించిన వాదనిది. దీనికి చంద్రచూడ్ ఇలాగే ప్రభుత్వం విధానాన్ని అమలుచేయాలని కోరుకొంటున్నామని స్పందించారు.
కేంద్రం నోట్ చాలా సంగతులను ప్రస్తావించింది. ఆర్మీ అన్నది వృత్తి మాత్రమేకాదు అంతకుమించిన బాధ్యతనని అంది. కుటుంబానికి దూరంగా ఉండటం, భాగస్వామి ఉద్యోగ అవసరాలు, పిల్లలు, వాళ్ల చదువు, గర్భందాల్చితే విధులకు చాలాకాలం దూరంగా ఉండటం ఇలా చాలా సమస్యలు మహిళాసైనికాధికారులకు ఉన్నాయని చెప్పింది. అంతేనా? ఎక్కువ మంది సైనికులు గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు. వాళ్లు మహిళలపై ఉన్న సామాజిక దృక్పథాన్ని మోసుకొస్తారు. వాళ్లు తమకన్నా పెద్ద స్థాయిలో మహిళ అధికారులు ఉంటే వాళ్ల ఆర్డర్స్ ను పాటించడానికి వాళ్లు ఇంకా సిద్ధంగా లేరని నోట్ చెప్పింది.
ఇది 2020. మహిళలు పర్వతాలను అధిరోహిస్తున్నారు. ఏలుతున్నారు. యుద్ధాలు చేస్తున్నారు. అంతర్జాతీయ సంస్థలకు సీఈఓలైయ్యారు.చంద్రునిమీదకూ వెళ్తున్నారు. ఎక్కడ అవకాశముంటే అక్కడ ఉన్నతస్థాయికి చేరుతున్నారు. సామర్ధ్యంలో కాని, తెలివిలోకాని, అంతెందుకు సాహసంలోకాని మగాళ్లకు ఏమాత్రం తీసిపోరు. అయినా నిర్ణయాలను తీసుకొనే సమయంలో కంపెనీలు, సంస్థలు వాళ్లను పక్కనపెడుతున్నాయి. తాజాగా భారతసైన్యం కూడా మహిళలకు అవకాశాలను ఇవ్వలేనంటోంది.
షాకింగ్ గా… తాజాగా కేంద్రం సుప్రీం కోర్టుకు మగసైనికులు మహిళాధికారులను ఒప్పుకోవడానికి సిద్ధంగాలేరు కాబట్టి, వాళ్లకు ఉన్నత ఉద్యోగాలను ఇవ్వాలేమని తేల్చేసింది. కమాండ్ సెంటర్లో పనిచేయడం అంతసులువుకాదు. మహిళలకు కుటుంబ బాధ్యతలుంటాయి. ఉద్రిక్తత సమయాల్లో వాళ్లను కిడ్నాప్ చేసే అవకాశమూ ఉందని… ఇలా ఇతరత్రా కారణాలను చెప్పింది. ఒక్కమాటలో పహారా కాయడం తప్ప మహిళా సైనికులు ఎందులోనూ పనిచేయరని కేంద్రం చెప్పినట్లే. కేంద్రం వాదనలోని సారాంశం… యుద్ధం, రక్షణ వ్యూహాలు, ఉన్నతోద్యాగాలు అన్నీ మగాళ్ల సొంతం. కాపలాకాయడం, క్లర్క్ వర్క్ మాత్రమే మహిళా సైనికులు చేయగలిగినవి.
1992లో సైన్యంలోకి తలుపులు తెరిచినప్పటి నుంచి మహిళా సైనికుల సంఖ్య 50 నుంచి 1300లకు పెరిగింది. అయినప్పటికీ, జాతీయ మీడియా కథనం ప్రకారం.. మహిళలకు కఠిన శిక్షణ ఇచ్చినప్పటికీ వాళ్లను 20 ఏళ్లయినా క్లర్క్ పనులకు తప్ప, సైనికావసరాలకు కోసం వాడలేదు. మహా అయితే, ఆయుధ గిడ్డంగులకు కాపలాకాయదం అంతే.
సైన్యంలో ఉన్నతోద్యాగాలకు బదులు, సైనిక దౌత్యంపేరుతో ఫోన్ల దగ్గరే కూర్చోబెట్టారు. పోలీసుల్లోనూ ఇదే పరిస్థితి. మొత్తం పోలీసు బలగాల్లో మహిళలది 7శాతమే. రిపబ్లిక్ పెరేడ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ మహిళా విభాగం కవాతు చేయడానికి ఇన్నేళ్లు పట్టింది. ఈ లెక్కన మహిళలకు సైనిక ఉన్నతోద్యాగాల్లో, కమాండింగ్ విభాగాల్లో, రక్షణ వ్యూహాల్లో సామర్ధ్యానికి తగ్గ పాత్రను పోషించడానికి ఎంతకాలం పడుతుంది? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ విషయంలో కాస్త మెరుగు.