బీజేపీకి మమత సవాల్ : దమ్ముంటే అరెస్ట్ చేయండి…జైల్లో నుంచే ఎన్నికల్లో గెలుస్తా

  • Published By: venkaiahnaidu ,Published On : November 25, 2020 / 11:06 PM IST
బీజేపీకి మమత సవాల్ : దమ్ముంటే అరెస్ట్ చేయండి…జైల్లో నుంచే ఎన్నికల్లో గెలుస్తా

Updated On : November 26, 2020 / 7:32 AM IST

Mamata Banerjee Dares BJP To Arrest Her తనను అరెస్టు చేసినా పశ్చిమ్​ బెంగాల్ లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో.. జైల్లో ఉండి విజయం సాధిస్తానని సీఎం మమతా బెనర్జీ అన్నారు. బెంగాల్ లో మరికొద్ది నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బుధవారం బంకురా జిల్లాలో భారీ ర్యాలీని నిర్వహించారు సీఎం మమతా.



ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలతో విరుచుకుపడ్డారు​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. బీజేపీ నాయకులు తమ ఎమ్మెల్యేలకు పార్టీ మారాలని డబ్బులు ఆఫర్‌ చేస్తున్నట్లు విమర్శించారు.



మమతా బెనర్జీ మాట్లాడుతూ… టీఎంసీ ఎమ్మెల్యేలను పార్టీ మారేందుకు బీజేపీ వారికి ఆఫర్లు ప్రకటిస్తోంది. కొంత మంది రాష్ట్రంలో కాషాయపార్టీ అధికారంలోకి వస్తుందని కలలు కంటున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వారు టీఎంసీ నాయకులను భయపెట్టేందుకు నారద(స్టింగ్‌ ఆపరేషన్‌), శారద(కుంభకోణం)లను బయటకు తీస్తారు. కానీ ఈ సందర్భంగా వారికి నేను ఒకటి స్పష్టంగా చెప్పదలచుకున్నా. బీజేపీకి గానీ, ఇతర ఏజెన్సీలకు గానీ నేను భయపడేది లేదు. మీకు గనక ధైర్యం ఉంటే నన్ను అరెస్టు చేసి కటకటాల్లోకి పంపించండి. అయినప్పటికీ నేను జైల్లో నుంచే ఎన్నికల్లో పోరాడి విజయం సాధిస్తా అని మమతా బెనర్జీ అన్నారు



ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికలను ఉద్దేశిస్తూ.. ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ను జైల్లో పెట్టారు. అయినప్పటికీ ఆయన పార్టీ మంచి ఫలితాలనే రాబట్టింది. బీజేపీ కొన్ని అవకతవకల వల్లే గెలిచింది. కానీ ప్రజాదరణ వల్ల మాత్రం కాదు. కొంతమంది తాము అధికారంలోకి వస్తామనే కలలతో టీఎంసీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు. అది జరగని పని. ఒకవేళ వారు అధికారంలోకి వచ్చినా.. ఆ తర్వాత మేం ఇంకా ఘనమైన విజయంతో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంటాం అని మమత అన్నారు.