మాట తప్పను : యడియూరప్పకు ఝలక్..కర్ణాటక బాధితులకు మమత సాయం

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. మాట ఇచ్చిన 48గంటల్లోనే ఇచ్చిన మాట నెరవేర్చారు. ఇటీవల మంగుళూరులో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే వీరికి పరిహారం ఇస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప మొదట ప్రకటించి ఆ తర్వాత మాట మార్చిన విషయం తెలిసిందే.
యడియూరప్ప నిర్ణయాన్ని తప్పుబట్టిన మమత మంగళూరు బాధితుల కుటుంబాలకు తాను అండగా ఉంటానని గురువారం(డిసెంబర్-26,2019) ప్రామిస్ చేశారు. అయితే మాట ఇచ్చినట్లుగానే ఆ కుటుంబాలకు అండగా నిలిచి సోషల్ మీడియాలో ప్రశంలందుకుంటున్నారు. మమత మాట ఇచ్చిన 48 గంటల లోపే శనివారం(డిసెంబర్-28,2019) తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం మంగుళూరు నగరంలో పోలీసు కాల్పుల్లో చనిపోయిన ఇద్దరు బాధితుల కుటుంబాలకు రూ. 5 లక్షలు చొప్పున చెక్కులు అందజేసింది. మృతులు మొహమ్మద్ జలీల్, నౌషీన్‌ల కుటుంబాలను తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధులు, పార్లమెంటు సభ్యులు దినేష్ త్రివేది, నదీముల్లా హక్‌లు పరామర్శించారు. గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా పరామర్శించారు.
ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు దినేష్ త్రివేది మాట్లాడుతూ.. ఇది మానవతా సాయం మాత్రమే. ఇందులో రాజకీయాలేమీ లేవు. ఇక్కడి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది కానీ ఇంతవరకూ ఇవ్వలేదు. అది పుండు మీద కారం చల్లటం వంటిదే. మమతా బెనర్జీ ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తారని ఆయన అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల జాబితాలను వ్యతిరేకిస్తూ మంగళూరులో ఆందోళనలు జరిగినపుడు పోలీసు కాల్పుల్లో జలీల్, నౌషీన్‌లు చనిపోయారు. ఆందోళనకారులు బందర్ పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు.