క్యూలైన్ దాటుకుని వెళ్లి ఓటేసిన గవర్నర్, సీఎం

  • Published By: venkaiahnaidu ,Published On : April 18, 2019 / 11:59 AM IST
క్యూలైన్ దాటుకుని వెళ్లి ఓటేసిన గవర్నర్, సీఎం

 

మణిపూర్ సీఎం బీరేన్ సింగ్, గవర్నర్ నజ్మా హెప్తుల్లా తమ ఓటు హక్కును వినియోగించుకున్న తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల రాజకీయ నాయకులు, ప్రముఖులు ఎవరైనా సరే ఓటు వేసేందుకు వచ్చినప్పుడు క్యూలైన్‌ లో నిలబడి కన్పిస్తున్నారు. సామాన్య ప్రజల మాదిరిగానే వరుసలో వేచిఉండి తమ వంతు వచ్చినప్పుడు ఓటు వేసి వెళ్తున్నారు. అయితే మణిపూర్‌ గవర్నర్‌, సీఎం మాత్రం అందుకు విరుద్దంగా క్యూలైన్‌ దాటుకుని వెళ్లి ఓటేశారు.

సార్వత్రిక ఎన్నికల రెండో దశలో భాగంగా ఇన్నర్‌ మణిపూర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి గురువారం(ఏప్రిల్-18,2019) పోలింగ్‌ జరిగింది.సగోల్‌ బంద్ ప్రాంతంలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన గవర్నర్‌ నజ్మా హెప్తుల్లా క్యూలైన్‌లో నిలబడకుండా నేరుగా పోలింగ్ బూత్ లోపలికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. హెయిన్‌ గంగ్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో రాష్ట్ర సీఎం బీరెన్‌ సింగ్‌ తన భార్యతో వచ్చి ఓటేశారు. ఆయన కూడా క్యూలైన్‌ ను దాటుకుని పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభ సమయం ఉదయం 7 గంటల కన్నా ముందే వచ్చి వరుసలో నిల్చున్న ఓటర్లను ఆయన పట్టించుకోలేదు. చకచకా పోలింగ్ స్టేషన్‌ కు వచ్చి, తన కన్నా ముందుగా వచ్చి వరుసలో నిలబడిన వారిని దాటుకుంటూ వెళ్ళి ఓటు వేశారు. సీఎం ఈ విధంగా ఓటు వేయడాన్ని చూసిన అక్కడి ఓటర్లు రుసరుసలాడారు.నిబంధనలను రూపొందించేవారే అమలు చేయకపోవడం దారుణం అని ఓటర్లు అన్నారు.