మోడీ 68వ మన్ కీ బాత్ : బొమ్మల హబ్ గా భారత్…రైతులపై ప్రశంసలు

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం(ఆగస్టు-30,2020) 68వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పురష్కరించుకుని జాతినుద్ధేశించి మాట్లాడారు. మన్‌కీ బాత్ కార్యక్రమంలో పలు కీలక విషయాలపై మోడీ మాట్లాడారు. దేశ ప్రజలందరూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని, అందరూ స్వదేశీ యాప్‌లనే వాడాలని ప్రధాని పిలుపునిచ్చారు.
ఆగస్ట్ 15 నాడు… ఆత్మనిర్భర భారత్ సాకారం కోసం గుచ్చి గుచ్చి చెప్పిన మోడీ… తాజాగా 68వ మన్ కీ బాత్ లోనూ ఇదే విషయాన్ని మళ్లీ చెప్పారు. ఏది కావాలన్నా చైనా లాంటి దేశాలపై ఆధారపడకుండా ఇండియాలోనే తయారవ్వాలనే సందేశాన్ని ఇవాళ్టి బాత్‌లో ఇచ్చారు మోదీ.
ప్రపంచానికి బొమ్మల హబ్‌గా భారత్
పిల్లలు ఆడుకునే బొమ్మల్ని మనమే తయారుచెయ్యాలని మోడీ పిలుపిచ్చారు. చిన్నారులు ఆడుకునే వస్తువులను ప్రపంచస్థాయిలో తయారు చేయాలని, స్థానిక కళలు, కళాకారులను ప్రోత్సహించాలన్నారు. మన కళాకారుల ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా కొండపల్లి చెక్కబొమ్మలకు మంచిపేరు ఉన్నదని చెప్పారు.
వోకల్ ఫర్ లోకల్ లో భాగంగా దేశీయంగా బొమ్మలు తయారీ చేసేందుకు ముందుకు రావాలని స్టార్టప్ కంపెనీలు, యువతను మోడీ కోరారు. ప్రపంచం మొత్తానికి బొమ్మలకు ప్రధాన కేంద్రంగా నిలిచేందుకు భారత్ కు శక్తిసామర్థ్యాలు ఉన్నాయని మోడీ అన్నారు. బొమ్మల పరిశ్రమ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 7 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందన్నారు మోదీ. ఈ రంగంలో భారత్ వాటా చాలా తక్కువగా ఉందని.. మరింత కృషి చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
నూతన ఆన్‌లైన్ గేమింగ్ వ్యవస్థ
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా నూతన ఆన్‌లైన్ గేమింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని దేశ యువతకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.
వేదాల్లో కూడా రైతుల మేలుపై శ్లోకాలు
మనది అన్నదాతలను గౌరవించుకునే సంస్కృతి అని ప్రధాని అన్నారు. మన వేదాల్లోనూ రైతులను ప్రశంసించే శ్లోకాలున్నాయని చెప్పారు. కరోనా సమయంలో కూడా మన రైతులు కష్టపడి సాగుచేస్తున్నారని చెప్పారు. ఈ ఖరీఫ్‌లో గతేడాదికంటే ఎక్కువ సాగుచేస్తున్నారని తెలిపారు.
పండుగలు మిస్ చేయవద్దు
పండుగల్ని మిస్ చేయవద్దన్న మోడీ …ప్రజలంతా కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ వాటిని జరుపుకోవాలన్నారు. ప్రతి పండుగనూ పర్యావరణహితంగా చేసుకోవాలన్నారు. మళయాలీలు ఘనంగా ఏటా జరుపుకునే “ఓనం” పండుగ ఉత్సాహం ఇవాళ ప్రపంచం నలుమూలలకూ చేరిందని . అంతర్జాతీయ ఉత్సవంగా మారుతోందన్నారు. ఓనం పండుగ చింగమ్ నెలలో వస్తుందని, పండుగ సందర్భంగా ప్రజలు కొత్తవస్తువులు కొనుగోలు చేస్తారని, ఇళ్లను అలంకరించుకుంటారని చెప్పారు. పుల్కమ్ తయారుచేసుకుని పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటాని తెలిపారు.
సెప్టెంబర్ 5న టీచర్స్ డే సందర్భంగా అందరూ టీచర్స్ డేని బాగా జరపాలని మోడీ పిలుపిచ్చారు. కరోనా టైంలో టీచర్లు సరికొత్త టెక్నిక్ లతో పాఠాలు చెబుతుండటం గొప్ప విషయం అన్నారు.
ఉపాధ్యాయులకు సూచన
2022లో భారత్ 75 ఏళ్ల స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే క్రమంలో స్వతంత్ర సమరయోధుల గురించి పిల్లలకు తెలియజేయాలని ఉపాధ్యాయులకు మోడీ సూచించారు. భావిభారత పౌరులు వారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఆర్మీ శునకాలపై పొగడ్తలు
74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కామాండేషన్ కార్డు పొందిన ఆర్మీ శునకాలు విదా, సోఫియాల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. కర్తవ్య నిర్వహణలో వాటి సేవలను మోడీ కొనియాడారు.
నార్తర్న్ కమాండ్‌లో ఉన్న ఆర్మీ డాగ్ యూనిట్‌కు చెందిన విదా…. భూమిలో పాతిపెట్టిన ఐదు మైన్స్‌ను, ఒక గ్రెనేడ్‌ను కనుగొనడంలో కీలక పాత్ర పోషించింది. తద్వారా సొంత దళాలకు ఎటువంటి ప్రాణనష్టం, గాయాలు జరగకుండా కాపాడింది.
స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ (బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్)కు చెందిన సోఫీ…. వాసన పట్టి బాంబులను గుర్తించటంలో సోఫియా నిపుణురాలు. ఇటీవల ఢిల్లీలో పేలుడు పదార్థాలను కనుగొంది. దీంతో పెను ప్రాణ నష్టం తప్పింది. ఈ రెండు తమ కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తించినందుకుగాను ప్రధాని ప్రశంసించారు.
Nutrition Month గా సెప్టెంబర్
సెప్టెంబర్ నెలను పోషకాల నెల (nutrition month)గా జరపబోతున్నట్లు మోడీ తెలిపారు. పిల్లలకు సరైన పోషకాలు అందితే… వారు శారీరకంగా, మానసికంగా బలంగా ఉంటారన్నారు.