టీఆర్‌ఎస్‌ హైకమాండ్‌తో మైనంపల్లి లొల్లి!

  • Published By: sreehari ,Published On : March 18, 2020 / 08:25 AM IST
టీఆర్‌ఎస్‌ హైకమాండ్‌తో మైనంపల్లి లొల్లి!

Updated On : March 18, 2020 / 8:25 AM IST

రాజకీయాల్లో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన అధికార పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇటీవల ముగిసిన బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకపోవడం చర్చనీయంశంగా మారింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొంది, గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి గత కొన్ని నెలులుగా అసంతృప్తితో ఉన్నారు. అందుకు బలం చేకూర్చేలా మైనంపల్లి తన నియోజకవర్గానికే పరిమితమవుతున్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాలకు కూడా దూరంగా ఉన్నారు.

అలిగిన మైనంపల్లి
2018 ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి టికెట్ దక్కించుకొని గెలుపొందారు మైనంపల్లి. రాజకీయంగా సీనియర్ అయినందున మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని ఆశించారు. కానీ ఆ అవకాశం దక్కకపోవడంతో ఆయన పార్టీపై అసంతృప్తితో ఉన్నారు.

2019 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థి కోసం నామమాత్రంగానే పని చేశారంటూ పార్టీ పెద్దలకు ఫిర్యాదులు అందాయి. అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్‌తో రెండుసార్లు ప్రత్యేకంగా భేటీ అయి, తన మనసులోని మాటను చెప్పుకున్నారు.

అసెంబ్లీకి దూరంగా :
టీఆర్‌ఎస్‌ పార్టీలో తనకు పెద్దగా గుర్తింపు దక్కడం లేదని అలక వహించిన మైనంపల్లి.. నియోజకవర్గం దాటి రావడం లేదని పార్టీ నేతలు తెలిపారు. పార్టీతో పెరిగిన గ్యాప్ కారణంగానే బడ్జెట్ సమావేశాలకు కూడా హాజరు కాలేదని తెలుస్తోంది. 

మొత్తం మీద అధికార పార్టీలో ఓ ఎమ్మెల్యే పార్టీకి దూరంగా ఉండడమే, అసెంబ్లీ సమావేశాలకు కూడా రాకపోవడం సంచలనంగా మారింది. మళ్లీ ఓసారి ఈ విషయంలో కేటీఆర్‌ మాట్లాడి.. మైనంపల్లిని దారిలోకి తీసుకొస్తారా? లేక అలానే వదిలేస్తారా అనే చర్చ పార్టీ కార్యకర్తలు, నేతల్లో సాగుతోంది.