ఊపిరాడటం లేదు : ఢిల్లీలో మరింత పెరిగిన వాయు కాలుష్యం
దేశరాజధాని ఢిల్లీ గ్యాస్ ఛాంబర్‌లా మారిపోయింది. అంతకంతకూ వాయు కాలుష్యం పెరిగిపోతోంది.

దేశరాజధాని ఢిల్లీ గ్యాస్ ఛాంబర్‌లా మారిపోయింది. అంతకంతకూ వాయు కాలుష్యం పెరిగిపోతోంది.
దేశరాజధాని ఢిల్లీ గ్యాస్ ఛాంబర్‌లా మారిపోయింది. అంతకంతకూ వాయుకాలుష్యం పెరిగిపోతోంది. శుక్రవారం రికార్డుస్థాయిలో కాలుష్య సూచి 599 పాయింట్లకు చేరుకోగా ఈ రోజు కూడా పరిస్థితి ఏ మాత్రం మారలేదు. పరిస్థితి మరింత దిగజారింది. ఈ రోజు కూడ నగరాన్ని పొగ కమ్మేసింది. ఎదురుగా కొన్ని మీటర్ల దూరంలో ఏముందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. జనం మాస్కులు లేకుండా బయటకు రావొద్దని ప్రభుత్వమే విజ్ఞప్తి చేసిందంటే పరిస్థితి తీవ్రత అర్తమవుతుంది. ఢిల్లీలో వాయు నాణ్యతను పరీక్షించే 37 స్టేషన్లలోనూ ఉదయం సమయానికి ప్రమాదకర సూచికలే కనిపిస్తున్నాయి.
సాధారణంగా AQI సూచీలో 400 దాటితేనే ప్రమాదకరంగా పరిగణిస్తారు. 500 దాటిందంటే పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారినట్లు లెక్క. కానీ ఢిల్లీలో ఇది సగటున దాదాపు 6వందలకు చేరింది. కొన్ని ప్రాంతాల్లో అయితే 7వందలు దాటినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టినా పరిస్థితి ఏ మాత్రం మెరుగు పడలేదు. గతేడాది జనవరి తర్వాత గాలిలో నాణ్యతా ప్రమాణాలు ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. పొరుగు రాష్ట్రాల్లో పంటల వ్యర్థాలను తగలబెట్టడంతో దేశరాజధాని గ్యాస్ ఛాంబర్‌ను తలపిస్తోంది. నవంబర్5 వరకూ స్కూళ్లకు సెలవలు ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం… నిర్మాణాలపై నిషేధం విధించింది. కంకర మెషిన్ల కార్యకలాపాలపైనా ఆంక్షలు విధించింది. ఫరీదాబాద్, గుర్‌గ్రామ్, ఘజియాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడా, సోనేపట్ ప్రాంతాల్లో కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను మూసివేశారు.
ఢిల్లీలో రాత్రికి రాత్రే 50 పాయింట్ల పొల్యూషన్ పెరిగిపోతున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా వెల్లడించింది. ఢిల్లీలో 27శాతం కాలుష్యానికి హర్యానా, పంజాబే కారణమని తేల్చింది. ఈ రెండు రాష్ట్రాల్లో పంట తగలబెట్టడంతో… హస్తినను పెద్దఎత్తున కాలుష్యం కమ్మేసింది. దీనికి సంబంధించిన ఒక చిత్రాన్ని విడుదల చేసింది. ఈ ఇమేజ్‌లో ఎర్ర రంగులో కనిపిస్తున్నదంతా పంటను తగలబెడుతుండగా ఎగసిపడుతున్న మంటలే. అంటే దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు సాధ్యమైనన్ని చర్యలు తీసుకుంటున్నారు. హర్యానాలో పంట తగలబెట్టిన ఘటనలపై పోలీసులు 17 కేసులు నమోదు చేశారు.
పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ల్లో వ్యవసాయ పూర్తయిన తరువాత వ్యర్థాలను తగులబెడతుంటారు. ఈ కాలుష్యం కూడా ఢిల్లీ వాసులకు ప్రాణాంతకంగా మారుతోంది. శీతాకాలం వచ్చిదంటే చాలు విపరీతమైన మంచు పొగతో పాటు వ్యవసాయ వ్యర్థాలకు తోడు ఈ వ్యవసాయ వ్యర్థాల దగ్ధం కూడా ఢిల్లీని కాలుష్యానికి గురి చేస్తోంది. దీంతో నగర వాసులు పలు అనారోగ్యాలకు గురవుతున్నారు.