ముంబైలో 5,500 దాటిన కరోనా కేసులు.. క్వారంటైన్ కేంద్రాలుగా స్కూళ్లు

ముంబైలో 5,500 దాటిన కరోనా కేసులు.. క్వారంటైన్ కేంద్రాలుగా స్కూళ్లు

Updated On : June 19, 2021 / 3:34 PM IST

భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే ఒక్క ముంబైలోనే కరోనా కేసుల తీవ్రత అత్యధికంగా ఉంది. ఇప్పటివరకూ ఏ భారతీయ నగరాల్లో కూడా నమోదు కాని పాజిటివ్ కేసులు ముంబైలో నమోదయ్యాయి. అత్యధికంగా 5,500 వరకు కరోనా కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. కొవిడ్-19 బాధితుల సౌకర్యార్థం ముంబై మున్సిపల్ స్కూళ్లను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. Brihanmumbai Municipal Corporation (BMC) కింద ఉన్న కొన్ని స్కూళ్లలో 1200 స్కూళ్లను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చాలని యోచిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే ఎన్ని స్కూళ్లను క్వారంటైన్ గా మార్చాలో ఇంకా నిర్ణయించలేదు.

కరోనా సంక్షోభంపై అధికార యంత్రంగాల చర్యలపై సమీక్షించేందుకు గతవారమే ముంబైని కేంద్ర ప్రభుత్వ బృందం సందర్శించింది. ఆ తర్వాతే క్వారంటైన్ సౌకర్యాలపై అక్కడి అధికారులు ఈ దిశగా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం స్కూళ్లు మూసివేయడంతో క్వారంటైన్ కేంద్రాలకు అనువైనవిగా అధికారులు అభిప్రాయపడ్డారు. టాయిలెట్ సౌకర్యాలు కూడా తగినంతగా ఉంటాయని బీఎంసీ అధికారి ఒకరు తెలిపారు. నగరంలోని కొన్ని మైదానాల్లో కూడా క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని బీఎంసీ చూస్తోంది. Goregaonలోని  NESCO ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ను బీఎంసీ కమిషనర్ ప్రవీణ్ పరదేశీ సందర్శించారు.

NESCOలో 1200 పడకల సామర్థ్యం ఉందని పౌర విభాగం వెల్లడించింది. Bandra Kurla Complex (BKC)లోని  MMRDA ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ను కూడా కమిషనర్ తనిఖీ చేయగా అందులో 3వేల పడకల వరకు ఏర్పాటు చేయవచ్చునని చెప్పారు. ఈ క్వారంటైన్ కేంద్రాలను కూడా లక్షణాలు కనిపించని బాధితులను కూడా పరిగణనలోకి తీసుకునే ఏర్పాటు చేయడం జరుగుతోందని తెలిపారు.

సోమవారం నాటికి కొత్త కరోనా కేసులు 395 నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 5,589కి చేరిందని బీఎంసీ పేర్కొంది. నగరంలో కొత్తగా 15 కరోనా మరణాలు కూడా నమోదయ్యాయి. ఇప్పటివరకూ మొత్తం 219 మృతిచెందినట్టు పౌర విభాగం ఒక ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్రంలో కొవిడ్-19 రోగుల్లో లక్షణాలు కనిపించినవారే 80 శాతం ఉన్నారని సీఎం ఉద్ధవ్ థాక్రే ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు.