రాజ్యసభలో 100దాటిన ఎన్డీయే బలం

  • Published By: venkaiahnaidu ,Published On : November 3, 2020 / 11:16 AM IST
రాజ్యసభలో 100దాటిన ఎన్డీయే బలం

Updated On : November 3, 2020 / 11:39 AM IST

NDA Crosses 100-Mark In Rajya Sabha పెద్దల సభలో ఎన్డీయే సంఖ్యాబలం పెరిగింది. కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి సహా 9 మంది బీజేపీ నేతలు సోమవారం ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికవడంతో పెద్దల సభలో ఎన్డీయే సంఖ్యాబలం 100దాటింది. మిత్రపక్షం జేడీయూకి రాజ్యసభలో ఐదుగురు సభ్యులున్నారు.

వీళ్లు కాకుండా, మిత్రపక్షాలు ఆర్పీఐ–అఠావలే, అసోం గణపరిషత్, మిజో నేషనల్‌ ఫ్రంట్, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ, నాగా పీపుల్స్‌ ఫ్రంట్, పీఎంకే, బోడోలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ లకు ఒక్కొక్కరు చొప్పున రాజ్యసభ సభ్యులున్నారు.



దీంతో ఎగువ సభలో ఎన్డీయే బలం 104కి చేరింది. ఇవి కాకుండా, నలుగురు నామినేటెడ్‌ సభ్యుల మద్దతు కూడా ప్రభుత్వానికి లభిస్తుంది. ఇప్పటివరకు రాజ్యసభలో కీలక బిల్లుల ఆమోదానికి ఇబ్బంది పడిన మోడీ సర్కార్ కి తాజా విజయాలతో ఆ సమస్య తొలగనుంది.

ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 242. యూపీ లో10, ఉత్తరాఖండ్‌ల్ 1 రాజ్యసభ స్థానానికి జరిగిన తాజా ఎన్నికల్లో 9మంది బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు.



దీంతో, బీజేపీకి సొంతంగా రాజ్యసభలో సంఖ్యాబలం 92కి చేరింది. తాజాగా యూపీ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో బీజేపీకి చెందిన నీరజ్‌ శేఖర్, అరుణ్‌ సింగ్, గీతా షాఖ్య, హరిద్వార్‌ దూబే, బ్రిజ్‌లాల్, బీఎల్‌ వర్మ, సీమా ద్వివేదీ ఉన్నారు. ఎస్పీ నుంచి రామ్‌గోపాల్‌ యాదవ్, బీఎస్పీ నుంచి రామ్‌జీ గౌతమ్‌ కూడా ఎన్నికయ్యారు. ఉత్తరాఖండ్‌ నుంచి బీజేపీ తరఫున నరేశ్‌ బస్వాల్‌ ఎన్నికయ్యారు.



మరోవైపు, చాలాకాలంగా పెద్దల సభలో ఆధిక్యం ప్రదర్శిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దల సభలో తన సంఖ్యాబలాన్ని కోల్పోయింది. రాజ్యసభలో కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య అత్యల్పంగా 38కి పడిపోయింది.