కరోనా 2.0ని ఇప్పుడే ఆపకుంటే ప్రమాదం..సీఎంలకు ప్రధాని కీలక సూచనలు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కట‌్టడి చర్యలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్​గా సమావేశమయ్యారు. సమావేశానికి ఛత్తీస్ ఘడ్, పశ్చిమ బెంగాల్ సీఎంలు హాజరుకాలేదు.

కరోనా 2.0ని ఇప్పుడే ఆపకుంటే ప్రమాదం..సీఎంలకు ప్రధాని కీలక సూచనలు

Pm Tells Chief Ministers

Updated On : March 17, 2021 / 4:06 PM IST

PM Tells Chief Ministers దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కట‌్టడి చర్యలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్​గా సమావేశమయ్యారు. సమావేశానికి ఛత్తీస్ ఘడ్, పశ్చిమ బెంగాల్ సీఎంలు హాజరుకాలేదు. కొవిడ్​పై పోరులో భారత్​ ఓ గొప్ప ఉదాహరణగా నిలిచినా..ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు ప్రధాని.

దేశంలోని 70 జిల్లాల్లో గత కొద్ది వారాల్లోనే కేసుల సంఖ్య 150శాతంకన్నా ఎక్కువ పెరిగింది. పరిస్థితిని ఇప్పుడే అదుపు చేయకపోతే… మరోమారు దేశవ్యాప్తంగా కరోనా విజృంభించే ప్రమాదం పొంచి ఉందని ప్రధాని తెలిపారు. దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆపాల్సిందేన‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. రాష్ట్రాల సీఎంలకు స్ప‌ష్టం చేశారు. దీనికోసం నిర్ణ‌యాత్మ‌క అడుగులు వేయాల‌ని చెప్పారు. ప్రభావవంతమైన కాంటాక్ట్ ట్రేసింగ్,సూక్ష్మ కంటైన్మెంట్ జోన్లపై దృష్టి పెట్టాలని సీఎంలకు ప్రధాని సూచించారు.

ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కూ 96 శాతం మంది కోలుకున్నార‌ని, చ‌నిపోయిన వారి సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉన్న దేశాల్లో ఇండియా కూడా ఒక‌ట‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని చెప్పారు. ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేయాల్సిన అవ‌స‌రం లేదన్నారు. కొన్ని ముందు జాగ్ర‌త్తలు, చ‌ర్య‌ల ద్వారా ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను దూరం చేయాలి అని సీఎంలకు మోడీ సూచించారు. కొన్ని ప్రాంతాల్లో టెస్టుల సంఖ్య త‌గ్గ‌డాన్ని ప్రధాని ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. ఎందుకు టెస్టుల సంఖ్య త‌గ్గింద‌ని ప్ర‌శ్నించారు. మ‌న విశ్వాసం..అతివిశ్వాసం కారాదు అని స్ప‌ష్టం చేశారు. చిన్న పట్టణాల్లో కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని సూచించారు. గ్రామాల్లో వైరస్​ విస్తరించకుండా జాగ్రత్త పడాలన్నారు.

వ్యాక్సిన్ వృథాపై కూడా ప్ర‌ధాని మాట్లాడారు. టీకా డోసులు వృథా కావడాన్నీ తీవ్రంగా పరిగణించాలని మోడీ సీఎంలకు సూచించారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ల‌లో వ్యాక్సిన్ వృథా 10 శాతం కంటే ఎక్కువ‌గా ఉందని ప్రధాని చెప్పారు. రాష్ట్రాలు వ్యాక్సిన్ వృథాను స‌మీక్షించాల‌ని సూచించారు. అస‌లు ఎందుకు వృథా అవుతోందో ప్ర‌తి రోజూ పర్య‌వేక్షించాల‌ని, అస‌లు వృథా లేకుండా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. టీకా కేంద్రాల సంఖ్య కూడా పెంచాలని ప్రధాని తెలిపారు.

ఇక క‌రోనాకు చెక్ పెట్ట‌డానికి మాస్క్‌లు త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని, భౌతిక దూరం నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని ప్రధాని సూచించారు. జ‌నం గుమిగూడే అవ‌కాశం ఉన్న ఈవెంట్ల‌లో అద‌న‌పు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని తెలిపారు.