ధరలను అదుపులో ఉంచేందుకే వ్యాక్సిన్లు, ఔషధాలపై జీఎస్టీ..మమత లేఖపై నిర్మలా సీతారామన్
కోవిడ్ చికిత్సకు దిగుమతి చేసుకునే ఔషధాలు, వైద్య పరికరాలపై,మెడికల్ ఆక్సిజన్‌పై విధిస్తున్న పన్నులను పూర్తిగా రద్దుచేయాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి

Nirmala Sitharaman Responds To Mamata Banerjees Letter On Covid 19 Tax
Nirmala Sitharaman కోవిడ్ చికిత్సకు దిగుమతి చేసుకునే ఔషధాలు, వైద్య పరికరాలపై,మెడికల్ ఆక్సిజన్‌పై విధిస్తున్న పన్నులను పూర్తిగా రద్దుచేయాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం ప్రధాని మోడీకి రాసిన లేఖపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ స్పందించారు. ధరలను అదుపులో ఉంచేందుకే వ్యాక్సిన్లు, ఔషధాలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లపై పన్ను విధిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.
మమతాబెనర్జీ లేఖ నేపథ్యంలో ఆదివారం వరుస ట్వీట్లు చేసిన నిర్మలా సీతారామన్…వ్యాక్సిన్ (5 శాతం పన్ను), ఔషధాలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల (12 శాతం పన్ను) ధరలను అదుపులో ఉంచేందుకే జీఎస్టీ విధిస్తున్నట్లు తెలిపారు. ఆయా వస్తువులకు ఒకవేళ జీఎస్టీ నుంచి పూర్తి మినహాయింపు ఇస్తే.. దేశీయ తయారీదారులు ముడిపదార్థాలు, సేవలకు చెల్లించిన పన్నులు తిరిగి రాబట్టుకోలేక అంతిమంగా వాటి ధరలను పెంచుతారని, తద్వారా వినియోగదారుడిపైనే భారం పడుతుందని తెలిపారు.
చాలా కొవిడ్ సంబంధిత వైద్య సామగ్రిపై ఇప్పటికే ఐజీఎస్టీ, కస్టమ్స్ సుంకం రద్దు చేసినట్లు గుర్తుచేశారు. రెమ్‌డెసివిర్ ఔషధానికి అన్ని రకాల సుంకాల నుంచి మినహాయింపు కల్పించామన్నారు. ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా, నిల్వకు సంబంధించిన యంత్రాలు, పరికరాలపైనా సుంకం నుంచి మినహాయింపు ఉందని పేర్కొన్నారు. 45 ఏళ్ల పైబడిన వారితో పాటు కరోనా యోధులకు కేంద్రమే టీకాలు ఉచితంగా ఇస్తోందని గుర్తుచేశారు. వాటికి సంబంధించిన జీఎస్టీని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు.