షాపై వెటకారాలు : కర్ణాటక జోలికొస్తే పంది జ్వరమే వస్తోంది
స్వైన్ ఫ్లూ తో బాధ పడుతున్న అమిత్ షా జ్వరాన్ని, కర్ణాటక రాజకీయాలకు ముడి పెడుతూ కాంగ్రెస్ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.

స్వైన్ ఫ్లూ తో బాధ పడుతున్న అమిత్ షా జ్వరాన్ని, కర్ణాటక రాజకీయాలకు ముడి పెడుతూ కాంగ్రెస్ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.
బెంగుళూరు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వైన్ ఫ్లూ వ్యాధితో బాధపడుతూ జనవరి 16 నుంచి ఎయిమ్స్ లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఆయన జ్వరానికి బెంగుళూరు రాజకీయాలు ముడి పెడుతూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు బీకే హరిప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదం అయ్యాయి. కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నించారు.. అందుకే అమిత్ షాకు పంది జ్వరం వచ్చిందని కామెంట్ చేశారు. అంతటితో ఆగకుండా కర్ణాటక రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే రోగం, పంది జ్వరంతో ఆగదు.. డయేరియా, వాంతులు వస్తాయంటూ శాపనార్థాలు పెట్టారు.
ఎంపీ హరిప్రసాద్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్, ముక్తార్ అబ్బాస్ నక్వీ, పీయూష్ గోయల్ ఘూటుగానే రిప్లయ్ ఇచ్చారు. అమిత్ షా కు వచ్చిన స్వైన్ ఫ్లూ కి మందు ఉంది.. ఎంపీ హరిప్రసాద్ కి వచ్చిన మానసిక రోగానికి మందు లేదని గోయల్ వ్యాఖ్యానించారు. అతడ్ని వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్పించాలని రాహుల్ గాంధీని కోరుతున్నామని కర్ణాటక బీజేపీ ట్విట్టర్ లో విరుచుకుపడింది. బీకేను కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు కూడా డిమాండ్ చేశారు.