Cabinet Reshuffle: కేబినెట్‌ను విస్తరిస్తారా? మంతనాలు అందుకేనా?

ప్రధాని మోడీ తన కేబినెట్‌ను విస్తరిస్తారా? మరో వారం రోజుల్లో మంత్రివర్గంలో మార్పులు చోటుచేసుకోబోతున్నాయా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోడీ, అమిత్‌షా, జేపీ నడ్డా మధ్య దాదాపు 5 గంటల పాటు జరిగిన చర్చ.. మంత్రివర్గ విస్తరణ గురించే అనే టాక్ హస్తినలో జోరుగా వినిపిస్తుంది.

Cabinet Reshuffle: కేబినెట్‌ను విస్తరిస్తారా? మంతనాలు అందుకేనా?

Pm Modi Leads Series Of High Level Meetings Prompting Buzz Of Cabinet Reshuffle

Updated On : June 12, 2021 / 2:38 PM IST

High-level Meetings: ప్రధాని మోడీ తన కేబినెట్‌ను విస్తరిస్తారా? మరో వారం రోజుల్లో మంత్రివర్గంలో మార్పులు చోటుచేసుకోబోతున్నాయా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోడీ, అమిత్‌షా, జేపీ నడ్డా మధ్య దాదాపు 5 గంటల పాటు జరిగిన చర్చ.. మంత్రివర్గ విస్తరణ గురించే అనే టాక్ హస్తినలో జోరుగా వినిపిస్తుంది. ప్రధాని మోడీ ఇదే విషయమై కీలక నాయకులతో మంతనాలు జరిపినట్టు ప్రచారం జరుగుతోంది. కరోనా సెకండ్‌ వేవ్‌లో మంత్రుల పనితీరును సైతం సమీక్షించినట్టు తెలుస్తోంది. అన్నీ కుదిరితే వారంలోనే కేబినెట్‌ విస్తరణ జరగవచ్చనే ప్రచారం సాగుతోంది.

అమిత్ షా, జేపీ నడ్డాతో భేటీ తర్వాత ఏడుగురు కేంద్ర మంత్రులతో ప్రధాని పలు విషయాలు చర్చించారు. ఈ భేటీలో ధర్మేంద్ర ప్రధాన్, ప్రకాశ్ జవదేకర్, హర్దీప్‌ సింగ్‌ పూరీతోపాటు మరికొంత మంది ఉన్నారు. అయితే ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీ ఏడాది వార్షికోత్సవాల సందర్భంగా మీటింగ్ జరుగుతుందని…అందులో భాగంగానే సమావేశమై ఉంటారని విశ్లేషిస్తున్నారు.

మరోవైపు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త పథకాలను ప్రకటించే అకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. యూపీతోపాటు పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌లలో ఎన్నికలు జరుగనున్నాయి. పంజాబ్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా, మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది.

2019లో అధికారం చేపట్టిన మోదీ.. మంత్రివర్గంలో ఇంతవరకూ మార్పులు చేర్పులు చేపట్టలేదు. కొందరు కేంద్ర మంత్రులు పలు కారణాలతో చనిపోయారు. అలాగే ఎన్డీయే నుంచి శివసేన, అకాళీ దళ్‌ బయటికి వచ్చాయి. దీంతో కొంతమంది మంత్రులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో పనిభారం పెరిగింది. మంత్రులపై భారం తగ్గించడానికి కేబినెట్ విస్తరణ ఉంటుందని అభిప్రాయం వినిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న కసరత్తు దానికోసమేనన్న ప్రచారం సాగుతోంది.