Rahul Gandhi: ఘాజీపూర్ సరిహద్దుల్లో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీని అడ్డుకున్న పోలీసులు
ఘాజీపూర్ సరిహద్దు వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి, బారికేడ్లను ఏర్పాటుచేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న ప్రాంతానికి వెళ్తున్న కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీని ఘాజీపుర్ సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సంభల్‌లోకి స్థానికేతరులు రావడంపై ఆంక్షలున్న నేపథ్యంలో వారిద్దరిని అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఘాజీపూర్ సరిహద్దు వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి, బారికేడ్లను ఏర్పాటుచేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ వే వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది.
ఇవాళ ఉదయం కాంగ్రెస్ నాయకుడు అజయ్ కుమార్ లల్లూ మాట్లాడుతూ.. తమ లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తప్పనిసరిగా హింసాత్మక సంభాల్‌ను సందర్శించి, బాధిత కుటుంబాలను కలుస్తారని చెప్పారు. పార్లమెంటులో తమ గళాన్ని లేవనెత్తుతారని అన్నారు.
‘‘ప్రభుత్వం మనల్ని ఎందుకు అడ్డుకుంటోంది.. ఏం దాచడానికి ప్రయత్నిస్తున్నారు? దేనికి భయపడుతున్నారు? ప్రతిపక్ష నేతగా ఉండి దేశంలో ఏం జరుగుతుందో చూసే హక్కు రాహుల్ గాంధీకి ఉంది’’ అని లల్లూ అన్నారు. కాగా, సంభల్ జిల్లాలో నవంబర్ 24న మొఘల్ కాలం నాటి మసీదును ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశీలించిన సమయంలో హింస చెలరేగింది. ఈ ఘర్షణల్లో నలుగురు మృతి చెందారు. పోలీసులు, స్థానికుల మధ్య ఘర్షణ జరిగి అనేకమంది గాయపడ్డారు.
Patnam Narender Reddy: పట్నం నరేందర్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు