ముందస్తు మొక్కు : తిరుమలకు కాలినడకన రాహుల్ గాంధీ

  • Published By: vamsi ,Published On : February 22, 2019 / 07:50 AM IST
ముందస్తు మొక్కు : తిరుమలకు కాలినడకన రాహుల్ గాంధీ

Updated On : February 22, 2019 / 7:50 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారిపోయిన పరిస్థితిలో ఆ పార్టీ క్యాడర్ లో జోష్ నింపేందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సిద్ధం అయ్యారు.  తిరుమ‌ల‌ శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దర్శనం కోసం అలిపిరి నుంచి కాలినడకన వెళుతున్నారు రాహుల్. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలోనే కాకుండా.. గాంధీ కుటుంబంలోని ఓ వ్యక్తి మొదటిసారి తిరుమలకు కాలినడకన వెళ్లటం ఇదే. రాహుల్ వెంట ప్రియాంకా గాంధీ కుమారుడు రెహాన్ వ‌ద్రా కూడా ఉన్నారు. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు భారీ సంఖ్య‌లో ఆయన వెంట వెళ్లారు.

ఢిల్లీ నుంచి ఉదయం 9:30 గంటలకు ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీ బయలు దేరి 11:50 గంటలకు తిరుపతి విమానాశ్రయంకు చేరుకోగా అక్కడి నుంచి కాలినడకన తిరుమల చేరుకుని మధ్యాహ్నం 3 గంటల తర్వాత శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుపతికి చేరుకుని సాయంత్రం 5 గంటలకు ‘ఏపీకి ప్రత్యేక హోదా భరోసా బస్సుయాత్ర’ బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రత్యేక హోదాపై తమ పార్టీ వైఖరిని ఆయన వెల్లడించనున్నారు. సభ ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. 

2014 ఎన్నికల సమయంలో మోడీ తిరుపతి తారకరామ మైదానం వేదికగా తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు  అదే మైదానంలో కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నిర్వహించే బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించనున్నారు.హోదాపై మోడీ మాటమార్చిన తీరును రాహుల్‌ ఎండగట్టడంతో పాటు కాంగ్రెస్ వైఖరిని వెల్లడించనున్నట్లు తెలుస్తుంది.