ఢిల్లీ రిటర్న్స్: ప్రతిపక్ష నాయకులకు…కశ్మీర్ లోకి నో ఎంట్రీ

ఆర్టికల్ 370రద్దు తర్వాత కశ్మీర్ వ్యాలీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు తెలుసుకునేందుకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రతిపక్ష నాయకులు కశ్మీర్ లో పర్యటించేందుకు రెడీ అయ్యారు. రాహుల్ తో పాటు గులాం నబీ ఆజాద్, కేసీ వేణుగోపాల్, ఆనంద్ శర్మ, డీఎంకే నాయకుడు తిరుచ్చి శివ, లోక్ తంత్రిక్ జనతా దళ్ నాయకుడు శరద్ యాదవ్, సీపీఐ,సీపీఎం నాయకులు సీతారామ్ ఏచూరి,డి.రాజా, ఎన్సీపీ నాయకుడు మజీద్ మీనన్, ఆర్జేడీ నాయకుడు మనోజ్ జా,తృణముల్ కాంగ్రెస్ లీడర్ దినేష్ త్రివేది,జేడీఎస్ నాయకుడు కుపేంద్ర రెడ్డి ఇవాళ(ఆగస్టు-24,2019)మధ్యాహ్నాం శ్రీనగర్ ఎయిర్ పోర్టుకి చేరుకున్నారు.
అయితే కశ్మీర్ లో పర్యటించేందుకు ప్రతిపక్ష నాయకులను పోలీసులు అనుమతించలేదు. శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ నుంచే ప్రతిపక్ష నాయకులను తిరిగి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో పోలీసులతో విపక్ష నేతలు వాగ్వాదానికి దిగారు. శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
క్రాస్ బోర్డర్ టెర్రరిజం,,తీవ్రవాదుల దాడులు,వేర్పాటువాదుల నుంచి జమ్మూకశ్మీర్ ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సమయంలో రాజకీయ నాయకులు శ్రీనగర్ లో పర్యటించి ఇతరులను అసౌకర్యానికి గురిచెయ్యరాదని జమ్మూకశ్మీర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ తెలిపింది.
ఆర్టికల్ 370రద్దును కాంగ్రెస్,సీపీఐ,ఆర్జేడీ,సీపీఎం,ఎన్సీపీ తదితర పార్టీలు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. కశ్మీరీల మనోభావాలను తెలుసుకోకుండా,ప్రతిపక్షాలతో సంప్రదించకుండా ఏకపక్షంగా మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.