Rahul Gandhi: మీ ధైర్యానికి సెల్యూట్.. పూంచ్‌లో రాహుల్ గాంధీ పర్యటన, బాధిత కుటుంబాలకు పరామర్శ..
దాడుల్లో గాయపడ్డ వారిని కూడా కలిసి మాట్లాడారు. పూంచ్ ప్రాంతంలోని స్కూల్ కి వెళ్లిన రాహుల్ అక్కడి విద్యార్థులతో మాట్లాడారు.

Rahul Gandhi: జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ లో పర్యటించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. పాకిస్తాన్ దళాలు జరిపిన సరిహద్దు కాల్పుల్లో ప్రభావితమైన కుటుంబాలను ఆయన కలిశారు. భారత్ ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ జరిపిన దాడుల్లో పూంచ్ ప్రాంతంలోని ప్రజలు ఎక్కువగా ప్రభావితమైన సంగతి తెలిసిందే. పాక్ జరిపిన దాడుల్లో 25 మంది పౌరులు చనిపోయారు. అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో బాధిత కుటుంబాలను కలుసుకునేందుకు రాహుల్ అక్కడ పర్యటించారు.
పూంచ్ లోని బాధితులను కలిసిన రాహుల్ వారితో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దెబ్బతిన్న గృహాలను రాహుల్ పరిశీలించారు. మృతుల కుటుంబాలను కలిసి ఓదార్చారు. దాడుల్లో గాయపడ్డ వారిని కూడా కలిసి మాట్లాడారు. పూంచ్ ప్రాంతంలోని స్కూల్ కి వెళ్లిన రాహుల్ అక్కడి విద్యార్థులతో మాట్లాడారు.
భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ తో రగిలిపోయిన పాకిస్తాన్.. సరిహద్దులోని గ్రామాలపై క్షిపణులతో దాడులకు తెగబడింది. పౌరులను లక్ష్యంగా చేసుకుంది. పాకిస్తాన్ సైనిక దాడులతో పూంచ్ ప్రాంతం గణనీయమైన నష్టాన్ని, ప్రాణనష్టాన్ని చవిచూసింది. శనివారం ఉదయం రాహుల్ గాంధీ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. మే 8, 10 మధ్య జరిగిన బాంబు దాడుల్లో దెబ్బతిన్న ఇళ్లను సందర్శించారు. బాధితులతో మాట్లాడారు. బాంబు దాడుల్లో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని కూడా పరామర్శించారు రాహుల్ గాంధీ.
ఓ స్కూల్ కి కూడా వెళ్లిన రాహుల్ గాంధీ విద్యార్థులతో ముచ్చటించారు. “చింతించకండి… ప్రతిదీ సాధారణ స్థితికి వస్తుంది. ఈ సమస్యకు మీరు స్పందించే విధానం ఏమిటంటే, మీరు కష్టపడి చదవాలి, కష్టపడి ఆడాలి. స్కూల్ లో చాలా మంది స్నేహితులను సంపాదించుకోవాలి” అని ఆయన విద్యార్థులతో అన్నారు.
Also Read: దేశంలో కరోనా కలకలం.. కోవిడ్ కొత్త వేరియంట్లు గుర్తింపు.. ఆ రాష్ట్రంలో హైఅలర్ట్..
పాక్ జరిపిన దాడుల్లో మరణించిన వారిలో కవల సోదరులు కూడా ఉన్నారు. పుట్టినరోజు జరుపుకున్న కొన్ని రోజులకే పాకిస్తాన్ జరిపిన బాంబ్ షెల్లింగ్‌లో కవల సోదరులు మరణించారు. ఈ సంఘటనలో వారి తండ్రి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. రాహుల్ గాంధీ వారి ఇంటికి కూడా వెళ్లారు. బాధిత కుటుంబాలను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు రాహుల్ గాంధీ. జాతీయ స్థాయిలో వారి సమస్యలను లేవనెత్తుతానని హామీ ఇచ్చారు.
”ఇది పెద్ద విషాదం. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అపారమైన నష్టం జరిగింది. నేను ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో లేవనెత్తాలని వారు నన్ను అభ్యర్థించారు. వారు చెప్పినట్లే నేను చేస్తాను” అని మీడియాలో అన్నారు రాహుల్ గాంధీ.
పూంచ్ లో పర్యటనకు సంబంధించి రాహుల్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. “ధ్వంసమైన ఇళ్ళు, చెల్లా చెదురుగా పడి ఉన్న వస్తువులు, తడిసిన కళ్ళు, ప్రతి మూలలో ప్రియమైన వారిని కోల్పోయిన బాధాకరమైన కథలు. ఈ దేశభక్తి గల కుటుంబాలు ప్రతిసారీ ధైర్యం, గౌరవంతో యుద్ధ భారాన్ని మోస్తున్నాయి. వారి ధైర్యానికి సెల్యూట్” అని రాసుకొచ్చారు.
ఫిబ్రవరి 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ మెరుపు దాడులు నిర్వహించింది. దీంతో రగిలిపోయిన పాకిస్తాన్ దొంగ దెబ్బతీసింది. పూంచ్ సెక్టార్‌లో జనావాసాలపై విరుచుకుపడింది. ఫిరంగి, మోర్టార్ దాడులు చేసింది. మే 7, 10 మధ్య జమ్మూ కాశ్మీర్ అంతటా పాకిస్తాన్ జరిపిన ఫిరంగి, క్షిపణులు, డ్రోన్ దాడుల్లో 28 మంది పౌరులు మరణించారు. వారిలో ఒక్క పూంచ్ జిల్లాలోనే 13 మంది ఉన్నారు. 70 మందికి పైగా గాయపడ్డారు.
పూంచ్ పర్యటనకన్నా ముందు.. ఏప్రిల్ 25న శ్రీనగర్‌లో పర్యటించారు రాహుల్ గాంధీ. పహల్గాం ఉగ్రవాద దాడిలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులను కలుసుకున్నారు. ఈ ఉగ్రదాడిలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని కూడా ఆయన పరామర్శించారు.