రైల్వే కొత్త రూల్ : అరగంట ముందే చేరుకోవాలి

  • Published By: veegamteam ,Published On : January 6, 2019 / 01:45 PM IST
రైల్వే కొత్త రూల్ : అరగంట ముందే చేరుకోవాలి

ఢిల్లీ: రైలు ప్రయాణికులు ముఖ్య గమనిక. త్వరలో కొత్త రూల్ రానుంది. ఇకపై రైలు బయలుదేరే సమయానికి 20 నిమిషాల ముందే రైల్వేస్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీ ప్రయాణం క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కొత్త సెక్యూరిటీ సిస్టమ్‌ను అమలు చేయనున్నారు. రైల్వేస్టేషన్లకు వచ్చే ప్రయాణికులను, వారి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఆ తర్వాతే లోనికి అనుమతిస్తారు. దీనికి కొంత సమయం తీసుకుంటుంది. భద్రతా చర్యల్లో భాగంగా తనిఖీలు ఉంటాయి కనుక రైలు బయలుదేరే 20 నిమిషాల ముందే స్టేషన్‌కు చేరుకోవాలని, తమకు సహకరించాలని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు తెలిపారు.
ఎయిర్‌పోర్టులో కామన్:
ఎయిర్‌పోర్టుల్లో ఇలాంటి తనిఖీలు కామన్. ప్రయాణికులను క్షుణ్ణంగా చెక్ చేశాకే వారిని లోనికి అనుమతిస్తారు. అందుకే ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారు విమానం బయలుదేరే సమయానికన్నా రెండు గంటలు ముందుగానే ఎయిర్‌పోర్టుకి చేరుకుంటారు. మరీ గంట ముందుగా కాకపోయినా.. కనీసం 20నిమిషాల ముందే రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలని అధికారులు ప్రయాణికులకు సూచించారు.
సీసీ కెమెరాలు, బాంబు స్క్వాడ్ యంత్రాలు:
కుంభమేళా జరుగుతున్న యూపీలోని అలహాబాద్ రైల్వేస్టేషన్‌లో ఇప్పటికే ఇలాంటి తనిఖీలు చేస్తున్నారు. కర్నాటకలోని హుబ్లీ రైల్వే‌స్టేషన్‌లోనూ అమలు చేశారు. ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సిస్టమ్‌లో భాగంగా ఈ తరహా తనిఖీలకు శ్రీకారం చుడుతున్నారు. 2016లోనే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సెక్యూరిటీ కోసం హై ఎండ్ టెక్నాలజీని వాడుతున్నారు. సెక్యూరిటీలో భాగంగా సీసీ కెమెరాలు, స్రీనింగ్ సిస్టమ్, బాంబు డిటెక్షన్ యంత్రం, బాంబు డిస్పోజల్ యంత్రాలను వాడుతారు. ఈ ప్రాజెక్ట్ కోసం 385కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. రియల్ టైమ్ ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. దీని ద్వారా సమాచారం వెంటనే ఆర్పీఎఫ్ విభాగానికి చేరిపోతుంది. దీంతో మరుక్షణమే వారు అలర్ట్ అవుతారు.