5 రోజులు సడలింపు ఇవ్వండి : కేంద్రాన్ని కోరిన అశోక్ గెహ్లాట్

  • Published By: chvmurthy ,Published On : April 21, 2020 / 03:23 PM IST
5 రోజులు సడలింపు ఇవ్వండి : కేంద్రాన్ని కోరిన అశోక్ గెహ్లాట్

Updated On : April 21, 2020 / 3:23 PM IST

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోటానికి కేంద్ర  ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ తో వివిధ రాష్ట్రాల్లో ఇరుక్కు పోయిన వలస కార్మికులు, ఇతర రాష్ట్రాల విద్యార్ధులు వారి వారి రాష్ట్రాలకు వెళ్లేందుకు 5 రోజులపాటు సడలింపు ఇవ్వాలని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్  కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరారు.  

ఏప్రిల్‌ 14 వరకు మొదటి విడత లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ… తరువాత దానిని మే3 వరకు పొడిగిస్తూ ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన చేశారు. దీంతో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికులకు, విద్యార్థులకు తమ తమ ప్రాంతాలకు వెళ్లడానికి ప్రత్యేక రైళ్లు, రవాణా సదుపాయాలు కల్పించాలని అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేయాలని భావించినప్పుడు విదేశీయులను ఏవిధంగా అయితే వారి దేశాలకు పంపించారో అలాగే వలస కార్మికులు కూడా వారి స్వస్థలాలకు వెళ్లడానికి కనీసం ఐదు రోజుల పాటైనా ప్రత్యేక రైలు సర్వీసులు కల్పించాలని అశోక్ గెహ్లాట్, అమిత్ షాను కోరారు. 

అన్ని రాష్ట్రాల కంటే తమ రాష్ట్ర పరిస్థితి భిన్నమైనదని అశోక్‌ గెహ్లాట్‌ అన్నారు. పెద్ద సంఖ్యలో రాజస్తానీలు అస్సాం, ఈశాన్య రాష్ట్రాలు, బెంగాల్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో చిక్కుపోయారని వారు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని తెలిపారు. వారు తమ స్వగ్రామాలకు వచ్చి వారి కుటుంబ సభ్యులను కలుసుకోవాలని ఎదురు చూస్తున్నారన్నారు. 

ఒక్కసారి వారికి అనుమతినిస్తే లాక్‌డౌన్‌ అనంతరం తిరిగి వారు తమ పనులపై శ్రద్ధ చూపుతారని పేర్కొన్నారు. ఈ విషయంపై కేంద్రం ఆలోచన చేస్తుందని అమిషా భరోసా ఇచ్చారని గెహ్లాట్‌ తెలిపారు. విద్యార్ధులు, వలస కార్మికులు తమను స్వగ్రామాలకు తీసుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారని ఈ విషయంపై కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవాలని జార్ఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ సీఎంలు కూడా  కేంద్రాన్ని  కోరారు.