రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేయాలంటూ మానవహారం

రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా తేలి.. యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఏడుగురిని విడుదల చేయాలని తమిళనాడు మంత్రివర్గం తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్‌కు పంపింది. అయితే రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయంపై గవర్నర్ ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో వారిని విడుదల చేయాలంటూ తమిళనాడులో మానవహారం నిర్వహించారు. వివిధ తమిళ సంస్థలు రాష్ట్రవ్యాప్యంగా ఈ ‘మానవహారం’లో పాల్గొన్నాయి. 28 ఏళ్లుగా జైలుశిక్ష అనుభవిస్తున్న ఏడుగురిని విడిచిపెట్టాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. అయితే గవర్నర్ భన్వరిలాల్ మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకోగలరని, అంతకుమిచి మరో మార్గం లేదని అక్కడి ప్రభుత్వం చెబుతుంది.
రాజీవ్ గాంధీ 1991లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఏడుగురిని దోషులుగా తేల్చారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో మొదట 26 మందికి మరణ శిక్ష విధించారు. తర్వాత వీరిలో ఏడుగురే దోషులుగా మిగిలారు. 1990లో నళినికి, మరో ముగ్గురికి మరణ దండన పడింది. రాబర్ట్ ప్యాస్, జయకుమార్, రవిచంద్రన్‌లకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. 2000వ సంవత్సరంలో నళిని మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చారు. మరణ శిక్ష పడిన మరో ముగ్గురికి 2014లో శిక్షను తగ్గించి, యావజ్జీవ కారాగారం విధించారు. వీరి క్షమాభిక్ష దరఖాస్తుల పరిష్కారంలో తీవ్రమైన జాప్యం జరిగిన నేపథ్యంలో శిక్షను తగ్గించారు.